వేణుగోపాల్ దీక్ష భగ్నం | Venugopal initiated offended | Sakshi
Sakshi News home page

వేణుగోపాల్ దీక్ష భగ్నం

Aug 25 2013 3:21 AM | Updated on Sep 1 2017 10:05 PM

జంగారెడ్డిగూడెంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్ దీక్షను శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు.

జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : జంగారెడ్డిగూడెంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్ దీక్షను శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఎస్సై బీఎన్ నాయక్ ఆధ్వర్యంలో రెండు వాహనాల్లో పోలీసులు అంబులెన్స్‌తో దీక్షా శిబిరం వద్దకు వచ్చి వేణుగోపాల్‌ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. జేఏసీ ప్రతినిధులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించారు.
 
 ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు వేణుగోపాల్‌ను పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రి వద్ద కూడా సమైక్యవాదులు జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. ఆసుపత్రిలో వేణుగోపాల్‌కు డాక్టర్ సునీత వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ పల్స్‌రేట్ తగ్గిందని, షుగర్ లెవల్స్ కూడా పడిపోయాయని, అందువల్ల వైద్యం తప్పదని తెలిపారు. వేణుగోపాల్ మాట్లాడుతూ ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు.
 
 వేణుగోపాల్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశామని ఎస్సై నాయక్ తెలిపారు. అంతకుముందు వేణుగోపాల్ దీక్షకు మద్దతుగా రిలే దీక్షల్లో నోముల లీలావతి, జలగం మౌనిక, పట్నాల సాయి, పమిడిపల్లి బ్రహ్మాజీలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కొడాలి సత్యనారాయణ వేణుగోపాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్షా శిబిరాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు, సంస్థలు, సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని సంఘీభావం తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement