హామీ ఇచ్చి మోసం చేశారు.. | Velugu Employees Protest in Kurnool | Sakshi
Sakshi News home page

హామీ ఇచ్చి మోసం చేశారు..

Dec 7 2018 1:33 PM | Updated on Dec 7 2018 1:33 PM

Velugu Employees Protest in Kurnool - Sakshi

కర్నూలులో ర్యాలీ నిర్వహిస్తున్న వెలుగు ఉద్యోగులు

కర్నూలు(హాస్పిటల్‌): తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..గత ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారని  ఏపీ గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంక్షేమ సంఘం వెలుగు(జేఏసీ)సెర్ఫ్‌ నాయకులు శ్రీధర్‌రెడ్డి, రహెమాన్, పుల్లయ్య విమర్శించారు. కర్నూలులో వెలుగు ఉద్యోగులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థాని క శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు, అక్కడ నుంచి ధర్నా చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్‌)లో ప్రాజెక్టు మేనేజర్స్, డిస్ట్రిక్ట్‌ మేనేజర్స్, అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్స్, కమ్యూనిటీ కో ఆర్డినేటర్, సపోర్టింగ్‌ స్టాప్, ఎంఎస్‌సీసీలుగా జిల్లాలో 384 మంది వెలుగు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు.

పదేళ్ల క్రితానికి, ఇప్పటికీ  పనిభారం రెట్టింపు అయిందని,  జీతం మాత్రం పెరగలేదన్నారు. 2014లో తాడేపల్లి గూడెం ఎన్నికల సభలో వెలుగు ఉద్యోగులను తన మానసపుత్రులని, తాను అధికారంలోకి వస్తే ఉద్యోగాలను తప్పకుండా క్రమబద్ధీకరిస్తానని నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. ఈవిషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చా రని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీని విస్మరించారన్నారు. ఈ కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 5వేల మందికి పైగా వెలుగు ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారన్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించేంత వరకు సమ్మె విరమించబోయేది లేదని చెప్పారు.  జేఏసీ నాయకులు కృష్ణుడు, ఖాదర్, మనోహర్, శేఖర్, ప్రసాద్, రాఘవేంద్ర,రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement