ఇప్పటి వరకూ అనధికారికంగా కొనసాగుతన్న విద్యుత్ కోత అధికారికంగా మారింది.
ఖమ్మం, న్యూస్‌లైన్: ఇప్పటి వరకూ అనధికారికంగా కొనసాగుతన్న విద్యుత్ కోత అధికారికంగా మారింది. ఈ మేరకు శనివారం నుంచి ఎన్‌పీడీసీఎల్ అమలు పరుస్తోంది. మరమ్మతులు, ఇతర కారణాల పేరుతో విధిస్తున్న అనధికారిక విద్యుత్ కోతలతో ఇప్పటికే సతమతమవుతుండగా తాజాగా అధికారులు తీసుకున్న నిర్ణయం మరింత అవస్థలపాల్జేస్తోందని జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో బైట దోమల మోత... ఇంట్లో ఉక్కపోతతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ సమస్యను అధిగమిం చాల్సిన అధికారులు అధికారికంగా కోతను విధించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
కారణం ఇదే...: జిల్లాలోని వివిధ కేటగిరీలకు చెందిన విద్యుత్ కనెక్షన్లకు రోజుకు 5.9 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా, జిల్లాకు 5.2 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. విద్యుత్ వినియోగం, సరఫరాలో ఉన్న అంతరాయాన్ని అధిగమించాల్సి ఉంది. వరి, పత్తి, మిర్చి పంటలు ఎదిగే దశలో ఉన్న నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్ అవసరం పెరిగింది. ఈక్రమంలో దీని ప్రభావం ఇతర వినియోగదారులపై పడిందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు రోజుకు మండల కేంద్రాల్లో 4 గంటలు, సబ్‌స్టేషన్ కేంద్రాల్లో 6 గంటలు కోత విధిస్తున్నారు. గ్రామీణప్రాంతాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. అంటే.. పగలంతా కరెంటు ఉండదన్నమాట.