విశ్వవిద్యాలయాల్లో విశృంఖలత్వం

University Professors And College Teachers molested Female Students - Sakshi

సాక్షి , రాజమహేంద్రవరం: యువతను సన్మార్గంలో పెట్టి సమాజ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించాల్సినా గురువులు గాడి తప్పుతున్నారు. కొందరి వక్రబుద్ధి మొత్తం విద్యావ్యవస్థకే కళంకం తెచ్చిపెడుతోంది. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుందామని ఎన్నో ఆశలతో వందల కిలోమీటర్ల దూరం నుంచి తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చే విద్యార్థినులకు మనో ధైర్యం నింపాల్సిన బాధ్యత గురువులపై ఉంది. అటువంటి వారే ఇంటర్నల్‌ మార్కులను ఆసరాగా చేసుకుని బరితెగించి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు దిగడం జుగుప్సాకరంగా మారింది. వీటిని సంస్కరించాల్సిన పెద్దలు పాలకమండళ్ల పీఠాలపై కూర్చొనికూడా అరికట్టలేకపోతున్నారు. కాకినాడ జేఎన్‌టీయూ, రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నతమైన విద్య అందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ చేరుతున్నారు. ఆవు చేలో మేస్తే చందంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ కొత్తపల్లి వీర్రాజు ఏకంగా సహచర ఉపాధ్యాయినులపైనే వేధింపులకు ఒడిగట్టడం విడ్డూరం. ఈయనపై కేసు పెట్టినా గత టీడీపీ సర్కార్‌లో కేసును నీరుగార్చేయడం తెలిసిందే. ఈ బాగోతాన్ని ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో వైఎస్సార్‌కాంగ్రెస్‌ ప్రభుత్వం చొరవ తీసుకుని సస్పెండ్‌ చేసింది.

జేఎన్‌టీయూకేలో...
గత ఏడాది కాకినాడ జేఎన్‌టీయులో కూడా ఇప్పుడు నన్నయ వర్సిటీలో జరిగినట్టే ఎంటెక్‌ విద్యార్థినులపై ప్రొఫెసర్‌ కె.బాబులు లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనమైంది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న ఒక మంత్రి అండదండలతో టీడీపీ నేతలు ప్రొఫెసర్‌ కు అనుకూలంగా పావులు కదిపారు. చివరకు విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలపడంతో వర్సిటీ ఐఎస్‌టీ డైరెక్టర్‌ (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) ప్రొఫెసర్‌ కె.బాబులును తప్పిం చారు. ఆ సంఘటన మరువకుండానే నన్నయలో ఇంగ్లిషు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.సూర్యరాఘవేం ద్ర లైంగిక వేధింపుల బాగోతం సంచలనమైంది. విద్యార్థినులు నేరుగా సీఎంకు  లేఖ రాయడం, ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి వచ్చి రాష్ట్ర స్థాయిలో తీవ్ర సంచలనమైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను విచారణకు పంపించారు. ఇంగ్లిషు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులను స్పెషల్‌ క్లాసుల పేరుతో బలవంతంగా రాజమహేంద్రవరంలో తన ఫ్లాట్‌కు తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డ రాఘవేంద్రను సస్పెండ్‌ చేయడానికి పాలకమండలి మీనమేషాలు లెక్కించడం విమర్శలపాలైంది.

లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థినులు నేరుగా సీఎంకు లేఖ రాసుకున్నా, రాఘవేంద్ర నిజస్వరూపం వర్సిటీలో చాలా మందికి తెలిసినా.. చర్యలకు వెనుకాడటం గమనార్హం. ఆంధ్ర మహిళా ఫో రం జోక్యం తరువాతనే సస్పెన్షన్‌ ఉత్తర్వులు వెలు వడ్డాయి. గురువారం వరకూ నిందితుడ్ని అరెస్టు చేయకుండా వదిలేయడం తదితర పరిణామాలు మేధావి వర్గాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవేళ ఆంధ్రమహిళ ఫోరం చొరవ తీసుకోకుండా, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తదితరులు జోక్యం చేసుకోకుండా ఉండిఉంటే రాఘవేంద్ర అకృత్యాలు వర్సిటీ కాంపౌండ్‌ గేటు దాటి బయటకు వచ్చేవే కావని మహిళా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

హైపవర్‌ కమిటీపై భిన్నాభిప్రాయాలు
ఇవన్నీ ఓ ఎత్తైతే రాఘవేంద్రపై సమగ్ర విచారణ కోసం నియమించిన హైపవర్‌ కమిటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ అనుబంధంగా ఉన్న కాకినాడ పీజీ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో ఇద్దరు టీచింగ్, ఇద్దరు నాన్‌టీచింగ్, ఇద్దరు ఎన్‌జీఓలతో కలిపి ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీపై విమర్శలు వస్తున్నాయి. ఏడుగురు సభ్యుల కమిటీలో ఇద్దరు ఎన్‌జీఓలు మినహాయిస్తే మిగిలిన ఐదుగురు వర్సిటీలో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. ఇటువంటి వ్యవహారాల్లో ఏర్పాటయ్యే ఈ తరహా కమిటీల విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే విశ్వా సం చాలా తక్కువగా ఉంటుందంటున్నారు. ఎం దుకంటే విచారణ అనంతరం కమిటీలో మెజార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా నివేదిక రూపొం దుతుందనేది బహిరంగ రహస్యమే. అందునా ఏడుగురు సభ్యులలో ఐదుగురు సభ్యులు వర్సిటీ ఉద్యోగులే కావడం గమనార్హం. కేవలం ఇదే కారణంతో రాజమహేంద్రవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తులసి హైపవర్‌ కమిటీ నుంచి వైదొలగడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

చర్యలపై పలు సందేహాలు
రాఘవేంద్ర    లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆంధ్రమహిళా ఫోరం వర్సిటీలోకి ప్రవేశించక ముందు, ఆ తరువాత పరిణామాలను బేరీజు వేసుకుంటే  ప్రస్తుతం జరుగుతున్న విచారణ పలు సందేహాలకు తావిస్తోంది. ఇందుకుతోడు రాఘవేంద్రపై ‘ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ చట్టం సెక్షన్‌ 67 ఎ’ ప్రకారం కేసు నమోదుచేసి ఉంటే చర్యలు తీవ్రంగా ఉండేవని రాష్ట్ర బార్‌ అసోసియేషన్‌ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు అభిప్రాయపడుతున్నారు. అటువంటి చర్యల ద్వారా మాత్రమే వర్సిటీలో ఇటువంటి అకృత్యాలకు చెక్‌ పెట్టవచ్చునంటున్నారు. ఇదిలా ఉండగా, వర్సిటీలో గురువారం నాడు చోటుచేసుకున్న సంఘటనలు చర్చనీయాంశమయ్యాయి. వర్సిటీ నుంచి సమాచారం బయటకు ఎలా పోతుందనే అంశం అంతర్గత సమీక్షలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇద్దరు అధ్యాపకురాలు తప్పుపట్టారని విశ్వసనీయంగా తెలిసింది. విద్యార్థినులతో రాఘవేంద్ర అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలకు తామే ప్రత్యక్ష సాక్షులమని వివరించడంతో అధికారులు మిన్నకుండిపోయారని సమాచారం.

అప్పుడు జేఎన్‌టీయూకేలో, ఇప్పుడు నన్నయలో అయినా నిష్పక్షపాత విచారణ ద్వారా విద్యార్థినుల్లో మనో ధైర్యాన్ని నింపే ప్రభుత్వ ప్రయత్నాలకు విశ్వవిద్యాలయాల పాలకమండళ్ల ప్రతినిధులు కాస్త మానవతాదృక్పథంతో సహకరించాల్సి ఉంది. ఈ తరహా వ్యవహారాలు తలెత్తినప్పుడు గతంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బయటి వర్సిటీ ప్రొఫెసర్‌తో కమిటీ వేయడం లేక, స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించారు. వర్సిటీలపై మరింత నమ్మకం పెరిగేలా చూడాల్సిన గురుతర బాధ్యత పాలకమండళ్లపై ఉంది.

కంచే చేను మేస్తే?
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ...ఇదీ మన సంప్రదాయం. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుంటారని ఎంతో నమ్మకంతో పాఠశాలలకు, కళాశాలలకు పంపుతారు. గురువే కీచకునిగా మారితే, ఇక విద్యార్థినులు తమ సమస్యలçను ఎవరితో చెప్పుకోవాలి? కంచే చేను మేస్తే ఎవరు దిక్కు? విద్యాసంస్థలలో నిఘా మరింత పెంచాలి. ఇటీవల నన్నయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన కొన్ని సంఘటనలు మానవత్వానికే మచ్చ తెచ్చేతీరులో ఉన్నాయి. పరిస్తితిని అదుపుచేయకపోతే, విద్యావ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితులు తలెత్తవచ్చు.                                                   
– ఎం.ఉమాదేవి, ప్రిన్సిపాల్, శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా డి.ఎడ్‌.కళాశాల                                                                                                                                                                                      
విచక్షణతో కూడిన కోరికలు మాత్రమే ఉండాలి
మానవునికి కోరికలు ఉండాలి, కానీ అవి విచక్షణతో కూడినవై ఉండాలి. విద్యాలయాలలో ఇటువంటి కీచకులు తరచుగా కనిపిస్తున్నారు. వీరిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి. ఇలాంటివారికి వేసే శిక్షలు కఠినంగా ఉండాలి. అప్పుడే మరో కీచకుడు తయారవకుండా ఉంటాడు.
– పి.శ్యామ, వైస్‌ ప్రిన్సిపాల్, ఏఎస్‌డీ మహిళా డిగ్రీ కళాశాల, కాకినాడ

గురువులు యోగా,మెడిటేషన్‌ తప్పనిసరిగా అలవరచుకోవాలి
మానవునికి జీవులలోకెల్లా భిన్నంగా విచక్షణాజ్ఞానాన్ని ప్రకృతి ప్రసాదించింది. ఆ విచక్షణను చదువుకున్న విద్యావంతులే మంచికి ఉపయోగించకపోవటం విచారకరం. మానవుడు వివేకవంతంగా నడవాలంటే యోగా, మెడిటేషన్‌లు అలవరచుకోవాలి. వీటితోపాటు ఆత్మశుద్ధి కలగటానికి దైవమార్గాన్ని అలవరచుకోవాలి. అప్పుడే మానవుడు వక్రబుద్ధి వదలి సన్మార్గంలో నడవగలుగుతాడు.
– డాక్టర్‌ డి.చిన్నారావు, రసాయన శాస్త్రం విభాగాధిపతి,  ఏఎస్‌డీ మహిళా డిగ్రీ కళాశాల, కాకినాడ

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం సెక్షన్‌ 67ఏ ప్రకారం కేసు నమోదు చేయాలి
ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో విద్యార్ధినులను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యూనివర్శిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సూర్య రాఘవేంద్ర పై ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం సెక్షన్‌ 67 ఏ ప్రకారం కేసు నమోదు చేసి ఉంటే బెయిల్‌ రావడానికి అవకాశం ఉండేది కాదు. బెయిల్‌ వచ్చే విధంగా పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేశారో అర్థం కావడం లేదు. పోలీసులు ఇప్పటికైనా సక్రమంగా విచారణ జరిపి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్రకారం కేసు నమోదు చేసి, ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ విద్యార్థుల, ప్రజల్లో  నమ్మకాన్ని కలిగేట్టు చేయాల్సిన అవసరం ఉంది.
– ముప్పాళ్ల సుబ్బారావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

క్రిమినల్‌ కేసులు నమోదు చెయ్యాలి
ఆదికవి నన్నయ్య యూనిర్శిటి విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురి చేసిన అధ్యాపకుడు సూర్య రాఘవేంద్రపై తక్షణం క్రిమినల్‌ కేసులు పెట్టాలి. విద్యార్థునులను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆయన అంగికరించాడు. నిర్భయ యాక్ట్‌ ప్రకారం కేసులు పెట్టాలి. భవిషత్తులో ఇలాంటివి జరగకుండా యంత్రాంగం ఏర్పాటు చెయ్యాలి. ఇంటర్నల్‌ కమిటీ వేయడంతో ఇంటర్నల్‌ మార్కులు వారి చేతిలో ఉంటాయి. భయం కొద్దీ చెప్పలేరు. అలాంటివి కాకుండా ప్రభుత్వం తరుపు నుంచి, ఐసీడీఎస్‌  అధికారులను వేసి విచారణ జరపాలి.
– టి.అరుణ్, సీపీఎం జిల్లా కార్యదర్శి

చట్టాలు కఠినంగా ఉండాలి...
సరస్వతీ నిలయాలుగా ఉండే విద్యాలయాల్లో ఇటువంటి చర్యలకు పాల్పడి విద్యావ్యవస్ధకే ముప్పు తెస్తున్నారు. ఇటువంటి వాటిపై వర్సిటీ స్ధాయిలో కఠినమైన చట్టాలు ఉండాలి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించడానికి వచ్చే విద్యార్థినులకు సరైన రక్షణ ఉండి ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి. జగన్‌ ప్రభుత్వం ఇంత త్వరగా స్పందించి చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది.
– కాశిన మల్లేశ్వరరావు,బీసీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు

వర్సిటీలో గ్రీవెన్స్‌సెల్‌ సమర్థవంతంగా పనిచేయాలి
వర్సిటీలో ఉన్న గ్రీవెన్స్‌ సెల్‌ సమర్థవంతంగా పనిచేసి మహిళలకు రక్షణ కల్పించాలి. వర్సిటీలకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల తరువాత గురువులనే పూజిస్తారు. వీరి ఆలోచనలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి. 
వై.జయ, ఇంగ్లీష్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్,జేఎన్‌టీయూకే

మొగ్గలోనే తుంచి వేయాలి                                                                                                                                                                                                         
చదువుచెప్పే అధ్యాపకుని ప్రవర్తనలో అభ్యంతరకరమైన ధోరణి కనపడితే, విద్యార్థినులు మౌనంగా ఉండరాదు. ఈ ధోరణులను మొగ్గలోనే తుంచి వేయడానికి అధికారులు, తల్లిదండ్రులు, సాటి విద్యార్థుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లాలి. విద్యార్థినులు సంఘటితశక్తిగా నిలబడాలి. తప్పు చేసినవాడిని నిలదీయాలి. అధ్యాపకులు విద్యార్థినులను తమ పిల్లలుగా భావించాలి.                                                                                                              
– గుంటూరి వెంకటేశ్వరరావు, కవి, విశ్రాంత ఓఎన్‌జీసీ జనరల్‌ మేనేజర్‌                                                                                                                 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top