వైఎస్ జగన్ ఆమరణదీక్షకు మద్దతుగా జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదంతొక్కాయి. జిల్లావ్యాప్తంగా నిరసన దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సోనియాదిష్టిబొమ్మల దహనం తదితర ఆందోళనలు నిర్వహించారు.
సాక్షి, నెల్లూరు : వైఎస్ జగన్ ఆమరణదీక్షకు మద్దతుగా జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదంతొక్కాయి. జిల్లావ్యాప్తంగా నిరసన దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సోనియాదిష్టిబొమ్మల దహనం తదితర ఆందోళనలు నిర్వహించారు. పార్టీ నెల్లూరు సిటీ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ కో ఆర్డినేటర్ డీసీ గోవిందరెడ్డి, దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రమణ్యం, సంజీవయ్య తదితర నేతలు శుక్రవారం జరిగిన జైల్‌భరోలో పాల్గొన్నారు.
ర్యాలీగా వస్తున్న కార్యకర్తలను పోలీసులు డీఆర్ ఉత్తమ్ హోటల్ వద్ద అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేసి కోవూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా బస్టాండ్ సెంటర్‌లో నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు నిరాహారదీక్ష చేశారు.
ఉదయగిరి నియోజక వర్గం జలదంకి బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు జగన్ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉదయగిరి బస్టాండ్‌లో వికలాంగులు రిలే నిరాహార దీక్షలు చేశారు. సీతారామపురం బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు జగన్ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేశారు.
ఆత్మకూరు నియోజక వర్గంలోని అనంతసాగరం నుంచి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రాపూరు వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతసాగరం నుంచి బయల్దేరి మర్రిపాడు, డీసీపల్లి, ఆత్మకూరు, ఏఎస్‌పేట, సంగం మండలానికి చేరింది.
కావలిలో వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు గాంధీ బొమ్మ సెంటర్‌లో రిలేనిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నేతలు కేఎం జయకుమార్, సుధాకర్, పులి పెనుకొండయ్య, జరుగుమల్లి రామారావు తదితరులు రిలేనిరాహార దీక్ష చేపట్టారు. వెంకటగిరి నియోజక వర్గంలోని కలువాయిలో జగన్‌కు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నాయకుడు అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది.