ఆ రెండు రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోండి

United Electricity Employees Union rastharoko - Sakshi

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను నిర్భంధించటం దుర్గార్గం

యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాస్తారోకో

విజయనగరం మున్సిపాలిటీ: సుప్రీంకోర్టు ఆదేశానుసారం విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేయటంలో పక్కనే ఉన్న తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను చూసి ఏపీ సర్కారు బుద్ధి తెచ్చుకోవాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు టి.వి.రమణ హితవు పలికారు. దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలుచేయాలని కోరుతూ ఈ నెల 20నుంచి విజయవాడలో చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షలను భగ్నం చేయటాన్ని ఖండిస్తూ జిల్లా కేంద్రంలో యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ జంక్షన్‌లో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తీరుపై యూనియన్‌ నాయకులు మండిపడ్డారు.

కేం ద్రంలో, రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల కు జీతాలు పెంచుకునేందుకు  ప్రభుత్వాల వద్ద డబ్బు ఉంటుందికానీ... కష్టపడి పని చేసే కార్మికులు చేసిన పనికి జీతం చెల్లించేందుకు డబ్బులు లేకపోవటం దౌర్భాగ్యమన్నారు. 13 జిల్లాలో గల కాంట్రాక్ట్‌ కార్మికులంతా తమ హక్కుల కోసం ఐకమత్యంగా పోరాటం చేస్తే వాటిని భగ్నం చేయటం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి ప్రభుత్వ నిర్బంధ చర్యలను  ప్రజాతంత్ర వాదులంతా ఖండించాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.వెంకటఅప్పారావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.రవిచంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు జి.అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top