సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం | United Andhra Movement in Seemandhra continues on 9th day on a row | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం

Aug 8 2013 3:59 PM | Updated on Sep 1 2017 9:44 PM

సీమాంధ్ర వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం వరుసగా 9వ రోజు కూడా కొనసాగుతోంది.

విజయవాడ: సీమాంధ్ర వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం వరుసగా 9వ రోజు కూడా కొనసాగుతోంది. వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలతోపాటు ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలు కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. విజయవాడ నగరంలోని బెంజ్‌సర్కిల్ సెంటర్‌లో కృష్ణాజిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ మానవహారం నిర్మించారు. అధికారులు  పశువులతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కృష్ణా జిల్లా  గుడివాడ కోర్ట్ ఎదుట న్యాయవాదులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.  నెహ్రు చౌక్ సెంటర్లో విద్యార్ధులు సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ చేశారు.

వైఎస్ఆర్ జిల్లాలో పలు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. కడప  కలెక్టరేట్ వద్ద ఆ పార్టీ నేతలు నిత్యానందరెడ్డి, వివేకానంద రెడ్డిలు నిరాహార దీక్షలో పాల్గొన్నారు.  జిల్లా కోర్టు వద్ద  న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రెవిన్యూ ఉద్యోగుల సంఘం విధులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించింది.
రిమ్స్‌లో డాక్టర్లు రిలే నిరాహార దీక్షలు  కొనసాగిస్తున్నారు. శంకరాపురంలో  విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా  ఎమ్మిగనూరు సర్కిల్లో  సమక్యాంధ్రాకు మద్దతుగా ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు.

విశాఖ నగరంలో  వైఎస్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నల్ల దుస్తులు దరించి  బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  సిటీ కన్వీనర్‌ ఉషా కిరణ్  ర్యాలీనీ ప్రారంభించారు. కాంగ్రెస్ చర్యల వల్లే రాష్ట్రం రావణకాస్టంలా మారిందని వారు మండిపడ్డారు.  జేఏసీ ఏర్పాటుకు విశాఖ జర్నలిస్టులు నిర్ణయించారు. ఇక నుంచి సమైక్యాంధ్ర ఉద్యమానికి బాసటగా నిలుస్తామని సీనియర్ జర్నలిస్ట్  రమణ మూర్తి చెప్పారు. అనకాపల్లిలో ట్రాక్టర్ ఓనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో  కేంద్ర మంత్రి చిరంజీవి, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు కనబడుటలేదని వాల్ పోస్టర్లు అతికంచారు. వెతికి అప్పగించిన వారికి లక్ష రూపాయల బహుమతి అని జెఎసి  ప్రకటించింది. పాలకొల్లు గాంధీబొమ్మ సెంటర్‌లో సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ మేక శేషుబాబు, ఎమ్మెల్యే బంగారు ఉషారాణిలు మద్దతు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.

ప్రకాశం జిల్లా అద్దంకిలో సమైక్యాంధ్రా ర్యాలీ నిర్వహించారు.  న్యాయవాదులు దీక్ష చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement