ఎన్నికల ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రోత్సాహక నిధులను ఇస్తామని
జంగారెడ్డిగూడెం రూరల్: ఎన్నికల ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రోత్సాహక నిధులను ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఏకగ్రీవ పంచాయతీల్లో 15వేల లోపు జనాభా ఉంటే రూ. 15 లక్షలు, 15వేల జనాభా దాటితే రూ. 20 లక్షలు మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావించిన ఏకగ్రీవ పంచాయతీలకు నిరాశే ఎదురైంది. వాటికి ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. 2013 జూలై 27నగ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 17 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వాటికి ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులను అందజేయడంపై ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ కనబరచడం లేదు.
జంగారెడ్డిగూడెం డివిజన్‌లో జంగారెడ్డిగూడెం మండలంలో అమ్మపాలెం, పుట్లగట్లగూడెం, బుట్టాయగూడెం మండలంలో అలివేరు, దొరమామిడి, కోయ రాజమండ్రి, ముంజులూరు, కొయ్యలగూడెం మండలంలో అచ్యుతాపురం, డిప్పకాయలపాడు, పోలవరం మండలంలో గెడ్డపల్లి, ఎల్‌అండ్‌డిపేట, మామిడిగొంది, వింజరం, చింతలపూడి మండలంలో నామవరం, కామవరపుకోట మండలంలో కెఎస్ రామవరం, పోలాసిగూడెం గ్రామ పంచాయతీ ఏకగ్రీవమయ్యాయని డివిజన్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. తమ గ్రామాలకు ప్రోత్సాహక నిధులను వెంటనే మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయా పంచాయతీల పాలకవర్గాలు కోరుతున్నాయి.