పెళ్లిచూపులకు వెళ్లినప్పుడే కాళ్లు కడగమన్నాడట వెనకటికో పొగరుబోతు కుర్రాడు. ఆ బాపతుగానే ఇప్పుడు అధికార పార్టీకి చెందిన కొందరు ఆలయూలపై
చైర్మన్ గిరీ రాకముందే ఆశావహుల కర్రపెత్తనం
వారిని ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నాయకులు
నిస్సహాయ స్థితిలో దేవాదాయ శాఖ అధికారులు
‘పెళ్లిచూపులకు వెళ్లినప్పుడే కాళ్లు కడగమన్నాడట వెనకటికో పొగరుబోతు కుర్రాడు. ఆ బాపతుగానే ఇప్పుడు అధికార పార్టీకి చెందిన కొందరు ఆలయూలపై అనధికారికంగా పెత్తనం చలాయిస్తున్నారు. ఎప్పుడో గుడి చైర్మన్‌గిరీ వస్తుందంటూ ఇప్పటి నుంచే ఆలయాల్లో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. అధిక ఆదాయం వచ్చే ఆలయాలే లక్ష్యంగా.. దేవుడి రాబడికే ఎసరు పెట్టడానికీ వెనుకాడటం లేదు. చెప్పినట్టు వింటే సరేసరి, లేకుంటే శంకరగిరి మాన్యాలు తప్పవంటూ ఆలయూల కార్యనిర్వహణాధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లాలో సుమారు రెండువేల ఆలయాలకు చైర్మన్‌లు, కమిటీ సభ్యుల నియామకం జరగాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గతించినా ఆలయాలు సహా నామినేటెడ్ పదవుల పందేరం జరగలేదు. రేపు, మాపు జీఓ వస్తుందంటూ ఆశావహులను ఎమ్మెల్యేలు వెంట తిప్పుకొంటున్నారు. అంతా మీరు చెప్పినట్టే జరుగుతుందని వారికి చెపుతూ మా వాళ్లను జాగ్రత్తగా చూసుకోండంటూ ఈఓలకు మౌఖిక ఆదేశాలు జారీచేశారు.
రాబడి ఎక్కువైన ఆలయూల కోసం పోటీ
ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రం కాకినాడ సహా రాజమండ్రి, అమలాపురం, తుని, పిఠాపురం, పెద్దాపురం ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లోఅనధికార చైర్మన్‌ల పెత్తనంతో ఈఓలు ఉద్యోగం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. వార్షికాదాయం రూ.25లక్షల నుంచి రూ.30 లక్షలకు పైబడి ఉన్న దేవాలయాల చైర్మన్‌ల కోసం ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. అటువంటి చోట్ల బహుముఖ జోక్యంతో తమ పని మరీ సంకటంగా మారిందని ఈఓలు ఆవేదన చెందుతున్నారు.
ఈ పరిస్థితి కాకినాడలోని పలు ఆలయాలతో పాటు పిఠాపురంలో ఎక్కువగా కనిపిస్తోంది. కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో అధికార పార్టీ నేత ఈఓకి కుర్చీ కూడా లేకుండా చేశారు. చివరకు కార్యాలయంలో ఈఓకి ఉన్న గదిపై కూడా ఆ అనధికార చైర్మన్ అజమాయిషీ చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆ ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంలో సాదరు ఖర్చులకు రూ.లక్ష పక్కనబెట్టాలని హుండీ లెక్కింపునకు వచ్చిన అధికారులపై సదరు నేత ఒతిడి తేగా వారు తిరస్కరించి విషయాన్ని పై అధికారులకు నివేదించారు.
ఉత్సవ కమిటీదే పెత్తనం..
బాలత్రిపురసుందరి సమేత రామలిం గేశ్వరస్వామి ఆలయంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. గతేడాది శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసమంటూ అధికార పార్టీ నేత తన ప్రధాన అనుయాయుడి నాయకత్వంలో అనధికారికంగా వేసిన ఉత్సవ కమిటీయే ఇప్పటికీ ఆలయంలో పెత్తనం చెలాయిస్తోంది. అందరి సమక్షంలోనే ఫలానా వ్యక్తికి పెత్తనం అప్పగిస్తున్నట్టు ఆ నేత ప్రకటించడం గమనార్హం. ఇప్పటికీ ఆ కమిటీలోని వారే అన్నీ తామే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖ ఉన్నతాధికారులకు కూడా మింగుడుపడటం లేదు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాదిరిగా ఇక్కడ అధికారులపై ఆర్థికపరమైన ఒత్తిళ్లు లేకపోవడం కొంతలో కొంత ఉపశమనం కలిగించే అంశం.
తూర్పుకు తిరిగి ద ణ్నమే శరణ్యం..
పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయ ఆధునికీకరణ పనులకు పుష్కరాల్లో రూ.40 లక్షలు మంజూరయ్యాయి. ఆలయ అధికారులు, నాయకుల మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో అక్కడి అధికార పార్టీ నేత సోదరుడికి పెత్తనం అప్పగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తలుపులమ్మ దేవస్థానంలో కూడా అనధికార చైర్మన్‌లదే పెత్తనం. ఇదివరకు చైర్మన్‌లుగా పనిచేసిన ఇద్దరు నేతలు తాము చెప్పిందే వేదం అన్నట్టు ఆలయ అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. పదోన్నతి కోసం లక్షలు కుమ్మరించినా ఫలితం దక్కక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక అధికారి నేతలతో తలపోటు ఎందుకని వారు చెప్పిన దానికల్లా సరే అంటున్నారు. ‘చైర్మన్‌ల నియామకం జరిగితే ఎలాగూ తప్పదు. కానీ ఇప్పటి నుంచీ ఈ పెత్తనమేమిటి దేవుడా?’ అని ఈఓలు వాపోతున్నారు. తూర్పుకు తిరిగి దణ్నం పెట్టడం తప్ప చేయగలిగింది లేదని నిట్టూరుస్తున్నారు.