వ్యాపారిని బురిడీ కొట్టించిన.. కి‘లేడీలు’

Two Lady Thief Catch At Jewellery Shop Cctv Footage Palakonda - Sakshi

మాటల్లో పెట్టి మూడు కేజీల వెండి వస్తువుల  అపహరణ

సంచలనమైన చోరీ ఘటన

రంగంలోకి దిగిన పోలీసులు

సాక్షి, పాలకొండ రూరల్‌: పాలకొండ పోస్టాఫీస్‌ రోడ్డు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో రద్దీగా ఉంది. శుక్రవారం కృష్ణాష్టమి కావటంతో స్థానికులు పూజాసామగ్రి, తమ చిన్నారులకు కృష్ణుని వేషయం వేయించేందుకు అవసరమయ్యే వస్తువుల కొనుగోలులో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో పోస్టాఫీస్‌కు ఎదురుగా ఉన్న నాయుడు జ్యూయలరీలోకి ఇద్దరు మహిళలు వెళ్లారు. వెండి పట్టీలు కావాలని షాపు యజమాని లోలుగు శ్రీనివాసరావును అడిగారు. ఈ మహిళలకు వెండి పట్టీలు చూపిస్తున్న క్రమంలో మరో ఇద్దరు మహిళలు అక్కడకు చేరుకుని బంగారు చెవి దుద్దులు కావాలని అడగటంతో యజమాని ఆ మహిళలకు బంగారు వస్తువులు చూపించే పనిలో ఉన్నాడు. ఇదే అదునుగా చేసుకుని ముందు వచ్చిన కి‘లేడీ’లు మూడు కేజీల వెండి పట్టీలను చీరల్లో దాచిపెట్టి, యజమానిని మాటల్లో పెట్టి అక్కడ నుండి ఉడాయించారు.

ఈ విషయాన్ని గంట వ్యవధి తర్వాత సీసీ కెమెరాలో గుర్తించిన వ్యాపారి లోబోదిబోమంటూ షాపు బయటకు వచ్చి చుట్టుపక్కల వాకాబు చేశాడు. అప్పటికే ఆ మహిళల అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే ఈ విషయం ఆనోటా, ఈనోటా మార్కెట్‌ అంతా తెలిసి సంచలనమైంది. విషయం తెలుసుకున్న ఇతర జ్యూయలరీ వ్యాపారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే రంగంలోకి దిగిన సీఐ ఎస్‌.ఆదాం ఘటన స్థలానికి చేరుకుని చోరీపై ఆరా తీశారు. షాపుల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. చోరీ  చేసేందుకు వచ్చింది ఇద్దరా, లేక నలుగురు ఒకే ముఠా చెందిన వారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈ తరహా చోరీలకు పాల్పడిన మహిళల పాత చిత్రాలతో ప్రస్తుత సీసీ టీవీ ఫుటేజ్‌ను సరిపోల్చే పనిలో పడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top