మృత్యుబావి | Two Died In Tractor Accident Visakhapatnam | Sakshi
Sakshi News home page

మృత్యుబావి

Nov 16 2018 8:07 AM | Updated on Nov 20 2018 12:42 PM

Two Died In Tractor Accident Visakhapatnam - Sakshi

గోకులపాడు వద్ద నేలబావిలో పడిపోయిన ట్రాక్టర్‌ తొట్టె

ఎస్‌.రాయవరం(పాయకరావుపేట): నేలబావి మృత్యు కూపమైంది. ఇద్దరి నిండు ప్రాణాలను మింగేసింది. నీరు లేకుండా నిరుపయోగంగా పడి ఉన్న నూతిని పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఆ బావి పెను ప్రమాదానికి కారణమైంది. అందులో నీరు ఉండి ఉంటే మరికొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. హైవే సమీపంలో ఉన్న బావిని పూడ్చివేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. మండలంలోని గోకులపాడు వద్ద ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ తొట్టె ఊడి నీరులేని నేలబావిలో పడి గురువారం ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌.రాయవరం నుంచి పాయకరావుపేట మండల శ్రీరాంపురం కొబ్బరికాయలు తీసుకెళ్లేందుకు గురువారం ఉదయాన్నే బయలు దేరిన ట్రాక్టర్‌లో డ్రైవర్, మరో ఏడుగురు ఉన్నారు. ట్రాక్టర్‌ గోకులపాడు సమీపానికి వచ్చేసరికి ఎదురుగా అకస్మాత్తుగా వచ్చిన మోటారు సైక్లిస్టును తప్పించడానికి డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు.

దీంతో ట్రాక్టర్‌ తొట్టె ఊడిపోయి సమీపంలోని నేలబావిలో పడింది. ఇంజిన్‌ వేరుపడడంతో డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. కర్రివానిపాలెం గ్రామానికి చెందిన గోనె సంచుల వ్యాపారి పినపాత్రుని సన్యాసిరావు(60), లింగరాజుపాలెం గ్రామానికి చెందిన కూలీ పుణ్యవంతుల అర్జున్‌ (50) తొట్టె కింద నలిగి అక్కడికక్కడే చనిపోయారు.  ఎస్‌.రాయవరానికి చెందిన దేశాబత్తుల సురేష్, బొల్లం సత్యనారాయణ, కర్రి వెంకటసూరి, లింగరాజుపాలెం గ్రామానికి చెందిన గొర్ల గోవిందు, సర్వసిద్ధి రమణ తీవ్ర గాయాలపాలయ్యారు. ట్రాక్టర్‌ను ఢీకొని బైక్‌ బోల్తాపడి చిన్నగుమ్ములూరుకు చెందిన చుక్కా వరలక్ష్మి తలకు తీవ్ర గాయమైంది. వీరందరికీ నక్కపల్లి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌.రాయవరం ఎస్‌ఐ కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

17రోజుల్లో కుమార్తెకు పెళ్లి ఉందనగా..
కూలి పనులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పుణ్యవంతుల అర్జున్‌ కుమార్తెకు డిసెంబర్‌ 2న పెళ్లి నిశ్చయమైంది. ఈ పరిస్థితుల్లో పెళ్లి పనులు చూసుకుంటూనే కూలి పనులకు వెళుతున్నాడు. అతని మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అర్జున్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాగా గోనె సంచుల వ్యాపారి పినపాత్రుని సన్యాసిరావు తెలిసిన వారి ట్రాక్టర్‌పై వెళితే దారి ఖర్చులు మిగులుతాయని భావించాడు. ఎస్‌.రాయవరం నుంచి గోకులపాడు వచ్చే సరికి ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు అతడిని కబళించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారంతా రోజు కూలీలే. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని వారంతా సంఘటన స్థలానికి చేరుకుని బావిలో పడిన వారిని ఒడ్డుకు చేర్చారు. బావిలో నీరు ఉంటే పడిన ఏడుగురు చనిపోయి ఉండేవారని,  నీరు లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని పలువురు పేర్కొన్నారు.

బాధితులకు బాబూరావు పరామర్శ
ప్రమాదం సంఘటన తెలిసిన వెంటనే పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ గొల్ల బాబూరావు నక్కపల్లి ఆస్పత్రికి చేరుకుని మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాబూరావు వెంట నాయకులు  మధువర్మ  ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement