చిట్టీల రాణి, మరో ఏడుగురు అరెస్టు | tv artist vijayarani arrested and unother seven people allso arrested | Sakshi
Sakshi News home page

చిట్టీల రాణి, మరో ఏడుగురు అరెస్టు

Published Sat, Apr 12 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

చిట్టీల రాణి, మరో ఏడుగురు అరెస్టు

హైదరాబాద్: చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి తోటి ఆర్టిస్టులను నిలువునా ముంచారనే కేసులో బుల్లితెర నటి బత్తుల విజయరాణితో పాటు మరో ఏడుగురిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీసీఎస్ అదనపు డీసీపీ (ఓఎస్డీ) ఇ.సుప్రజ, డీసీపీ పాలరాజు మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... ఎర్రగడ్డలో నివాసం ఉంటున్న విజయరాణి నాలుగేళ్ల నుంచి అనధికారికంగా రూ. లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలు నిర్వహిస్తోంది. అయితే ఒక్కో గ్రూప్‌లో పూర్తిగా సభ్యులు చేరకున్నా చిట్టీలు నిర్వహించేది.

దీంతో నష్టాలు రావడంతో వాటిని భర్తీ చేసేందుకు అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంది. ఎక్కువ మొత్తం వడ్డీలు చెల్లించడానికే పోవడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో తమకు డబ్బులు చెల్లించాలని రుణదాతలు కొందరు బెదిరించడంతో గత నెల ఆమె కుటుంబసభ్యులతో కలసి బెంగళూరుకు పారిపోయింది. సుమారు 80 మంది బాధిత ఆర్టిస్టులు రూ. 10 కోట్ల వరకు మోసపోయామంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు గత నెల 14న విజయరాణితో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో విజయరాణి కొడుకు చరణ్, కోడలు రేవతి, చెల్లెలు సుధారాణి, ఆమె భర్త చైతన్య, స్నేహితులు హరిబాబు, కట్టా మల్లేష్ గౌడ్, న్యాయవాది శ్రీనివాస్ ఉన్నారు. వారందర్నీ బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. విజయరాణికి 54 మంది నుంచి సుమారు రూ. 1.20 కోట్లు రావాల్సి ఉందని, ఆమె 78 మందికి సుమారు రూ. 2.20 కోట్లు చెల్లించాల్సి ఉందని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. అధిక వడ్డీలు వసూలు చేసిన 28 మందిపై  కేసులు నమోదు చేస్తామన్నారు. కార్పొరేషన్ బ్యాంకులో తాకట్టులో ఉన్న ఆమె ఇల్లును జీపీఏ చేసుకున్న వారిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు.
 
నేనూ బాధితురాలినే: విజయరాణి

 ‘‘నేను ఎవర్నీ మోసం చేయలేదు. శక్తికి మించిన వడ్డీలు కట్టడానికి అప్పులపై అప్పు చేశాను. చివరికి నా కుటుంబానికి తినడానికి చిల్లిగవ్వ లేకుంటే పోలీసులే తిండి పెట్టారు. చిట్టీలు ఎత్తుకున్న వారు తిరిగి డబ్బు చెల్లించలేదు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతామని వడ్డీ వ్యాపారులు బెదిరించినందుకే పారిపోయాను. నేను కూడా బాధితురాలినే..’’ అంటూ విజయరాణి మీడియా ముందు కన్నీటిపర్యంతమైంది
 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement