తిరునగరికి స్మార్ట్ వెలుగులు! | Tirunagari to Smart Light! | Sakshi
Sakshi News home page

తిరునగరికి స్మార్ట్ వెలుగులు!

Jun 7 2016 2:14 AM | Updated on Sep 4 2017 1:50 AM

తిరునగరిలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్తును సరఫరా చేయడానికి స్మార్ట్ గ్రిడ్ విధానం అమలులోకి తెస్తున్నారు.

విద్యుత్ చౌర్యానికి అడ్డుకట్ట.. సరఫరాలో లోపాల సవరణ.. తప్పుడు బిల్లులకు చెక్ పెట్టడం.. ప్రధాన కార్యాలయం నుంచే కనెక్షన్ కట్.. నష్టాల తగ్గింపు.. ఇదీ డిస్కం లక్ష్యం. ఇందుకోసం తిరునగరిలో స్మార్ట్ సిస్టమ్ అమలుకు నోచుకోనున్నది. ఈ దిశగా ఆ సంస్థ అడుగులు వేస్తోంది.  
 
తిరుపతి రూరల్: తిరునగరిలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్తును సరఫరా చేయడానికి స్మార్ట్ గ్రిడ్ విధానం అమలులోకి తెస్తున్నారు. నగరంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్ది నిరంతరం అంతరాయం లేని విద్యుత్తును సరఫరాకు రూ.325 కోట్ల వ్యయంతో స్మార్ట్‌గ్రిడ్ ఏర్పాటు చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రుపొందించారు.

ఈ మొత్తం లో రూ. 275 కోట్లు రుణం మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. అందులో భాగంగా తిరుపతిలోని సదరన్ డిస్కం కార్పొరేట్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా 15 స్మార్ట్‌మీటర్లను అమర్చారు. రానున్న రోజుల్లో 200 యూనిట్ల క న్నా అధికంగా విద్యుత్ వినియోగించే విని యోగదారులకు స్మార్ట్ మీట ర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలో దశల వారీగా 15 వేల మందికి స్మార్ట్ మీటర్లు అమర్చుతారు.
 
మెరుగుపడనున్న విద్యుత్ వ్యవస్థ
నగరంలో రూ.325 కోట్లతో విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపరచనున్నారు. నూతనంగా 33/11 కేవీ సామర్థ్యంతో నాలుగు ఇండోర్ విద్యుత్తు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ.14 కోట్ల అంచనాతో నివేదిక సిద్ధం చేశారు. నగరంలో శ్రీదేవి కాంప్లెక్స్, మున్సిపల్ పా ర్కు, ఉపాధ్యాయనగర్, శ్రీపద్మావతి మహిళ వర్సిటీ ప్రాం తాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. నగరంలో రూ.45 కోట్లతో 44 కిలోమీటర్ల మేర 33 కేవీ భూగర్భ విద్యుత్తు లైన్లు, మరో రూ.80 కోట్లతో 100 కిలోమీటర్ల మేర 11 కేవీ భూగర్భ విద్యుత్తు లైన్లు నిర్మిస్తారు.

రూ.180 కోట్లతో 200 కిలోమీటర్ల మేరకు ఎల్‌టీ లైన్లకు భూగర్భ విద్యుత్తు కేబుల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలో వివిధ ప్రాంతా ల్లో పాత ట్రాన్స్‌పార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు ఇప్పటికే ఉన్నవాటి సామర్థ్యాన్ని పెంచుతారు. మొత్తం నగరంలో 50 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయడానికి రూ. 80 లక్షలతో నివేదికలు రూపొందించారు. నగరంలో 3 పీహెచ్ సామర్థ్యమున్న స్మార్ట్ మీటర్లు తొలిదశలో 15 వేలు మీటర్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకు రూ.15 కోట్ల సొమ్ము వెచ్చించనున్నారు.
 
విద్యుత్తు చౌర్యానికి చెక్!
విద్యుత్తు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విద్యుత్ చౌర్యానికి చెక్‌పెట్టడంతోపాటు నష్టాలు తగ్గించుకుని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి స్మార్ట్‌గ్రిడ్ నిర్మాణానికి సిద్ధమైంది. స్మార్ట్‌గ్రిడ్‌లో భాగంగా స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే తిరుపతిలోని సదరన్ డిస్కం కార్పొరేట్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా 15 స్మార్ట్‌మీటర్లు బిగించారు. స్మార్ట్‌మీటర్లతో పాటు ప్రతి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మీటర్ రీడర్ ఏర్పాటు చేస్తున్నారు.

దీనికి ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలోని స్మార్ట్‌మీటర్లను అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరిగినా గుర్తించవచ్చు. ఏ ఇంట్లోని మీటరులో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు విద్యుత్తు చౌర్యం జరిగిందన్న విషయాన్ని సైతం కచ్చితంగా తెలసుకోవచ్చు. దీంతో పాటు ప్రతి నెల రీడింగ్ తీసే సమయంలో మీటరు వరకు వెళ్లి మాన్యూవల్‌గా కాకుండా డేటా సెంటర్ నుంచే విద్యుత్తు ఎంత వినియోగించారు? బిల్లు ఎంత? తదితర విషయాలతో బిల్లు వచ్చేస్తుంది.

దీనివల్ల తప్పుడు బిల్లులకు చెక్ పడుతుంది. అంతేకాకుండా బిల్లు చెల్లించని వినియోగదారులకు స్మార్ట్‌మీటర్‌లో లోడు బ్రేక్ స్విచ్  ద్వారా డేటా సెంటర్ నుంచే విద్యుత్ కనెక్షన్ కట్ చేయవచ్చు. బిల్ ఇన్‌స్పెక్టర్ల పనిభారం కూడా తగ్గుతుంది. స్మార్ట్ మీటర్లలో డిస్‌ప్లే సౌకర్యం కూడా ఉంది. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ విధానం కూడ అమల్లోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉందని, ఆ దిశగా మీటర్‌లో టెక్నాలజీని పొందుపరిచినట్లు డిస్కం అధికారి ఒకరు తెలిపారు. తొలుత నగరంలో కొంతభాగానికి అమలుచేసి అనంతరం నగరం మొత్తం విస్తరించే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement