పరిటాల మైనింగ్‌ మాఫియాపై సీఎంకు ఫిర్యాదు: తోపుదుర్తి

Thopudurthi Complains To CM On Paritala Family Mining Mafia  - Sakshi

మాజీ మంత్రి పరిటాల సునీత అండదండలతోనే.. 

క్రషర్‌ ముసుగులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు 

హంద్రీ–నీవా కాలువపై ఎక్కడా కనిపించని రాయి 

మైనింగ్‌ మాఫియాపై త్వరలో సీఎంకు ఫిర్యాదు 

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

సాక్షి, ఆత్మకూరు: మాజీ మంత్రి పరిటాల సునీత బంధువులు, ఎస్‌ఆర్‌సీ సంస్థ నిర్వాహకులు ‘వడ్డెర్ల బండ’ ద్వారా రూ.250 కోట్లు దోపిడీ చేశారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి, అక్రమంగా కంకర తరలించి సొమ్ము చేసుకున్నారని విరుచుకుపడ్డారు. ఆత్మకూరు మండలం కుర్లపల్లి సమీపంలోని కంకర క్రషర్‌ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ బండపై ఆధారపడి 200 వడ్డెర కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. అయితే పరిటాల సునీత బంధువులు, ఎస్‌ఆర్‌సీ సంస్థ వారు క్రషర్‌ పేరిట లీజుకు తీసుకుని, అక్రమంగా మరికొంత బండను ఆక్రమించుకున్నారని విమర్శించారు. మూడో ప్యాకేజీ కింద హంద్రీ–నీవా కాలువ నిర్మాణం కోసం 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయికి బిల్లు తీసుకున్నారన్నారు. వాస్తవానికి కాలువపై ఆ మేరకు రాయి కనిపించడం లేదన్నారు.

మరో 30 లక్షల టన్నుల రాయిని కంకరగా మార్చి అక్రమ మార్గంలో అమ్మేసుకున్నారన్నారు. వడ్డెర్ల బండకు సంబంధించి 24 ఎకరాలకు గాను 18 ఎకరాల్లో 35 లక్షల టన్నుల బండను క్రషింగ్‌ చేశారన్నారు. అంతేకాకుండా బండపైన, కాలువకు పైన ఉన్న రాయిలో దాదాపు 50 లక్షల టన్నుల రాయిని అమ్ముకున్నారన్నారు. మూడు ఎకరాలు బండ లీజు తీసుకుని, అంతకు మించి ఆక్రమించి బండ కొడుతున్నారని తెలిపారు. యరపతినేని మైనింగ్‌ మాఫియా తరహాలోనే ఇక్కడ కూడా మాఫియా చెలరేగిపోయిందన్నారు. క్రషర్‌ నిర్వాహకులు ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి సొమ్ము చేసుకుంటున్నా మైనింగ్‌ అధికారులు పట్టనట్టు వ్యవహరించారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆత్మకూరు పంచాయతీ రూ.60 కోట్లకు పైగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందన్నారు.  

ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు 
కంకర మిషన్‌ ద్వారా వెలువడే దుమ్ము సమీప పొలాలను కప్పేస్తుండటంతో పంటలు పండటం లేదని, స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారని రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టనట్టు వ్యవహరించారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఫిర్యాదు చేసిన రైతులపైనే తప్పుడు కేసులు పెట్టారన్నారు. అధికారులు ప్రజల పక్షాన పనిచేయాలని హితవు పలికారు. ఇదివరకే మైనింగ్‌ అధికారులకు, విజిలెన్స్‌ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. త్వరలోనే ఈ మైనింగ్‌ మాఫియాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆత్మకూరు, కృష్ణమరెడ్డిపల్లి, నసనకోట, సుబ్బరాయునిపల్లి వద్ద మైనింగ్‌ దోపిడీ యథేచ్ఛగా సాగుతోందన్నారు. అవినీతి అక్రమాలకు సహకారం అందిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆత్మకూరు వడ్డెర్లకు జీవనోపాధిగా ఉన్న బండను తిరిగి అప్పగించాలని ఆయన సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top