
గుండె ఆపరేషన్లకు బ్రేక్
గుంటూరులోని పెద్దాసుపత్రిలో గుండె ఆపరేషన్లకు బ్రేక్ పడింది.
జీజీహెచ్‌లో మూలకు చేరిన హార్ట్‌లంగ్ మెషీన్ ఒకే ఒక శస్త్రచికిత్సతో రూ. 40 లక్షలు వృథా
గుంటూరులోని పెద్దాసుపత్రిలో గుండె ఆపరేషన్లకు బ్రేక్ పడింది. రూ. 40 లక్షల వ్యయం చేసి కొనుగోలు చేసిన హార్ట్‌లంగ్ మెషీన్ మూలకు చేరడమే ఇందుకు ప్రధాన అడ్డంకిగా తెలుస్తోంది. గుండె ఆపరేషన్లు చేసేందుకు సీమాంధ్రలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ అవసరమైన వైద్య సామగ్రి లేదు. ఈ నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ నుంచి గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో గుండె ఆపరేషన్లు నిర్వహించాలని నిర్ణయించారు.
తొలిసారిగా పాత గుంటూరుకు చెందిన ఓ బాలికకు గుండె ఆపరేషన్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో హార్ట్‌లంగ్ మెషీన్ మూలనపడిన విషయం వెలుగుచూసింది. జీజీహెచ్‌లో గుండె ఆపరేషన్లు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ గోపాలకృష్ణగోఖలే ఈ నెల 10న పెద్దాసుపత్రిని సందర్శించారు. గుండె వైద్యవిభాగంలో ఉన్న హార్ట్‌లంగ్ మెషీన్ పరిశీలించి ఆపరేషన్ నిర్వహించేందుకు ఇది పనికిరాదని తేల్చిచెప్పారు.
మూడేళ్ల కిందట ఆరోగ్యశ్రీ నిధులు వెచ్చించి రూ.40 లక్షల వ్యయ ంతో హార్ట్‌లంగ్ మెషీన్ కొనుగోలు చేశారు. అప్పట్లో సీటీఎస్ సర్జన్‌గా ఉన్న ఓ వైద్యుని వద్ద నుంచి ఈ మెషీన్ కొనుగోలు చేశారు. అయితే టెక్నికల్ అంశాలను పరిశీలించకుండా కొనుగోలు చేయడం వల్ల నేడు ఈ దుస్థితి దాపురించిందని అంటున్నారు.
► అప్పట్లో కూడా దీనిపై ఒకేఒక్క ఆపరేషన్ నిర్వహించగా అదీ విఫలమైనట్టు చెబుతున్నారు.
► ముందుగా నిర్ణయించిన విధంగా నవంబరు 1వ తేదీ నుంచి గుండె ఆపరేషన్లు జరగాలంటే కొత్త హార్ట్‌లంగ్ మెషీన్ కొనుగోలు చేయాల్సిదేనంటున్నారు. మళ్లీ ఇంత డబ్బు ఇప్పుడు ఖర్చు చేస్తారా అంటే అదీ అనుమానమేనని అంటున్నారు.
డీఎంఈతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం...
గుండె వైద్యవిభాగంలో హార్ట్‌లంగ్ మెషీన్ మూలనపడ్డ విషయాన్ని డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకువెళ్లి కొత్తది కొనుగోలు చేయడమా లేక ఉన్న పరికరానికి మరమత్తులు నిర్వహించడమా అనేది నిర్ణయిస్తాం. బయో మెడికల్ ఇంజినీర్లుతో పరికరాన్ని తనిఖీ చేయించి వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు,
జీజీహెచ్ సూపరింటెండెంట్