రాజకీయ నాయకుల చర్యలు, నడవడిక ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉండాలి. ప్రజామెప్పు పొందిన వారికే ఆదరణ లభిస్తుంది. పాతతరం నాయకుల చర్యలు అచ్చం అలానే ఉండేవి.
సాక్షి ప్రతినిధి, కడప : రాజకీయ నాయకుల చర్యలు, నడవడిక ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉండాలి. ప్రజామెప్పు పొందిన వారికే ఆదరణ లభిస్తుంది. పాతతరం నాయకుల చర్యలు అచ్చం అలానే ఉండేవి. స్వార్థ చింతనకు దూరంగా, ప్రాంతం అభివృద్ధే ధ్యేయంగా మసులుకునేవారు. ప్రస్తుత నాయకులు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి చర్య వెనుక తనకేమిలాభం అన్న ధోరణితోనే ముందుకు వెళ్తున్నారు. అధికారం ఉందంటే విచక్షణ మరిచి మరీ అడ్డంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి వ్యవహారంలోనూ తలదూరుస్తూ వివాదాస్పదమౌతున్నారు. అచ్చం అలాంటి పరిస్థితే కడప నగర టీడీపీ నేత బాలకృష్ణయాదవ్ కొనసాగించారు. వెరశి ఓ హత్య కేసులో చిక్కుకున్నారు. బాలకృష్ణ యాదవ్ కడప కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థిగా నిలుచుండిన్నారు. కడపలో టీడీపీకి ప్రజాదరణ లేకపోవడం కారణంగా మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన కార్పొరేటర్‌గా ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ప్రవర్తించడంలో ఆయన ముందు వరుసలో నిలిచారు. అందుకు జన్మభూమి కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజాద్‌బాషలకు అడ్డు తగులుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించారు.
అధికార దర్పంతో వ్యూహాత్మకంగా ఫోకస్ అయ్యేలా ఆయన చర్యలు ఉండేవి. ఇతని దుశ్చర్యలను ప్రభుత్వ యంత్రాంగం నియంత్రించకపోవడంతో మరింత అడ్డుఅదుపు లేకుండా పోయింది. ప్రస్తుతం బాలకృష్ణయాదవ్‌కు వ్యక్తిగతంగా రాజకీయ భవిష్యత్ సైతం ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం కడప నగర టీడీపీ అధ్యక్షుడుగా పార్టీ పదవి కట్టబెట్టేందుకు సంసిద్ధమైన తరుణంలో హత్య కేసులో నాల్గువ నిందితుడుగా ఇరుక్కుపోయారు. స్వీయ నియంత్రణ లేకపోవడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు.
కడప గడపలో ప్రతి వ్యవహారంలో జోక్యం...
కడపలో చిన్నచిన్న పంచాయితీలు చేయాలన్నా, పోలీసుస్టేషన్‌లో సెటిల్‌మెంట్లు చేయాలన్నా నేనున్నానని బాలకృష్ణయాదవ్ ముందుండేవారని పరిశీలకులు పేర్కొంటున్నారు. కార్పొరేషన్‌లో భవనాలకు అనుమతులు ఇవ్వాలన్నా, దేశం నేత అనుమతి లేకుంటే నిరాకరించే స్థాయికి యంత్రాంగం వచ్చింది. ఓ వైపు అధికారులు ఛీత్కరిస్తున్నా పట్టించుకోకుండా అడ్డంగా వ్యవహరించడం ఇటీవల సర్వ సాధారణమైంది. ఇటీవల ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ ప్రైవేట్ బిల్డింగ్ వ్యవహారంలో తల దూర్చి ధర్నా నిర్వహించడం చూసి పలువురు నవ్వుకున్నారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.
పులివెందులకు చెందిన సతీష్‌కుమార్‌రెడ్డి కిడ్నాప్...ఆపై హత్య వ్యవహారంలో సైతం అదే రీతిలో వ్యవహరించారు. నిర్భందించి చితక బాదడం, రక్త గాయాలతో ఉన్న సతీష్‌కుమార్‌రెడ్డి ఫొటోలను వాట్సాప్‌లో వారి బంధువులకు పంపడం వెనుక పూర్తిగా అధికార దర్పంతోనే విర్రవీగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వెరసి అవే ఫోటోలు బాలకృష్ణ యాదవ్‌ను హత్య కేసులో నిందితుడుగా చేర్చగల్గాయి. అధికార దర్పంతో ఇదే రీతిలో వ్యవహరిస్తున్న నేతలపై ఇక నుంచి అయినా నిఘా ఉంచి నియంత్రించాల్సి ఉంది.
రాజకీయ పైరవీలు
సతీష్‌కుమార్‌రెడ్డి హత్య కేసులో తనపాత్ర లేదని, తెలిసిన వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయమని చెప్పానని.. ఈ వ్యవహారంలో తనను గట్టెక్కించండని బాలకృష్ణ యాదవ్ ప్రభుత్వ పెద్దల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సతీష్‌కుమార్‌రెడ్డి హత్యోదంతం తెరపైకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన తన సామాజిక వర్గానికి చెందిన నాయకుని ద్వారా ప్రభుత్వ పెద్దల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పోలీసులపై కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. అమానుషంగా సతీష్‌కుమార్‌రెడ్డిని హింసించి చంపిన వారిని కఠినంగా శిక్షించాలన్న బాధితుల డిమాండ్ ఓ వైపు, అధికార పార్టీ నేతల ఒత్తిడి మరో వైపు ఉండగా పోలీసుల తీరు ఎలా ఉంటుందోన న్న చర్చ సాగుతోంది.