స్వతంత్రంగా, నిర్భయంగా ఎన్నిక నిర్వహించండి | The High Court has ordered the Election Commission. | Sakshi
Sakshi News home page

స్వతంత్రంగా, నిర్భయంగా ఎన్నిక నిర్వహించండి

Jul 11 2014 2:55 AM | Updated on Oct 20 2018 6:19 PM

స్వతంత్రంగా, నిర్భయంగా ఎన్నిక నిర్వహించండి - Sakshi

స్వతంత్రంగా, నిర్భయంగా ఎన్నిక నిర్వహించండి

జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను స్వంతంత్రంగా, నిర్భయంగా నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గురువారం హైకోర్టు ఆదేశించింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను స్వంతంత్రంగా, నిర్భయంగా నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గురువారం హైకోర్టు ఆదేశించింది. ఇది టీడీపీ నాయకులకు మింగుడు పడటం లేదు. నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ ఎన్నికల సమయంలో వీరంగం చేయడాన్ని వీడియో చూసి తెలుసుకున్న కోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఘాటుగా స్పందించింది.  ఎన్నికల ప్రాంగణం వద్ద బ్యారికేడ్లు నిర్మించాలని,  సీటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని, సభ్యులు తమ స్థానం నుంచి లేవకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
 
 ఎన్నిక ప్రక్రియలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేపట్టాలని సూచించింది. ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరిచి కోర్టుకు అందజేయాలని కూడా కోరింది.  ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు భుజాలు తడుమకుంటున్నారు. జెడ్పీ ఎన్నికల సమయంలో తాము ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడలేదని అంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణ కలెక్టర్ వద్దకు వెళ్లి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలని మాత్రమే కోరారని, ఆ సమయంలో ఆయన చేయి తగిలి, మైకు కింద పడిపోయిందని, తప్పంతా వైఎస్సార్‌సీపీదేనని చెప్పుకొస్తున్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత నెల్లూరులో ఆ పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో తాము వైఎస్సార్‌సీపీ సభ్యులకు ఓటు వేసేందుకు స్వాతంత్య్రం ఇవ్వాలని మాత్రమే కోరామని అన్నారు.
 
 అయితే వైఎస్సార్‌సీపీ  సభ్యులు చేతులు నరికేస్తామని, తలలు తీస్తామని బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అటువంటి వారిపై కేసులు పెట్టకుండా, తమ ఎమ్మెల్యే చేయి పొరపాటున తగిలిన కారణంగా మైకు పడిపోతే,  దానికి నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఆవేశంతో ఊగి పోయారు. ఆయనపై ఉన్న నాన్‌బెయిలబుల్ కేసు ఉపసంహరించుకోవాలని   సాక్షాత్తు కలెక్టర్‌నే సోమిరెడ్డి హెచ్చరించడం గమనార్హం. కురుగొండ్లపై కేసు తొలగించకపోతే,  వైఎస్సార్‌సీపీ  నేతల మీద కూడా కేసులు దాఖలు చేయాలని డిమాండ్ చేశారు.

 

అభ్యర్థులను ఓటు వేయకుండా నిర్బంధించి, గోవాకు తీసుకెళ్లారన్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం నాయకులు  వైఎస్సార్‌సీపీ  జెడ్పీటీసీ సభ్యులు కనిపించడం లేదని వారి బంధువులతో కేసు పెట్టించడం గమనార్హం. ఇందకూరిపేట జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకటరమణయ్య సహ జెడ్పీటీసీలతో క్యాంపులో ఉన్నారు. అయితే ఆయన సోదరి ప్రభావతి బందెల వెంకటరమణయ్య కనిపించడం లేదని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ప్రభావతితో బలవంతంగా  తెలుగుదేశం నేతలు కేసు పెట్టించినట్లు తెలిసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఒక మహిళా కార్పొరేటర్ కిడ్నాప్‌నకు గురైనట్లు కేసు పెట్టారు. అయితే ఆమె నేరుగా మేయర్ ఎన్నికల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement