మధ్యాహ్న భోజన పథకం నుంచి డ్వాక్రా గ్రూపులను తొలగించి వేరే వారికివ్వాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని
17 నెలల బకాయిలు చెల్లించండి
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల డిమాండ్
సిరిపురం : మధ్యాహ్న భోజన పథకం నుంచి డ్వాక్రా గ్రూపులను తొలగించి వేరే వారికివ్వాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ ఆ పథకం కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ‘మా పొట్టలు కొట్టొద్దని’ రాసిన ప్లకార్డులు పట్టుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాగైనా ఆ పథకం నుంచి తమను తొలగించి వేరేవారికి అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అందుకే 17 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని దుయ్యబట్టారు. జిల్లాలో 17 నెలలుగా 4వేల 8వందల మంది కార్మికులు పాఠశాలల్లో 9, 10 తరగతి చదువుతున్న పిల్లలకు సొంత పెట్టుబడితో మధ్యాహ్న భోజనం వండుతుంటే, బిల్లులు చెల్లించకుండా భయబ్రాంతుల్ని చేస్తున్నారని ఆరోపించారు.
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటి వరకూ రూ.16 కోట్ల బకాయిలుంటే కేవలం రూ.80 లక్షలు విడుదల చేశారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షురాలు కె.ద్రాక్షాయణి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సత్యవతి, మహాలక్ష్మి, రాజి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.