కేజీహెచ్ ప్రసూతి వార్డులో బుధవారం తెల్లవారుజామున కనిపించకుండా పోయిన మగ శిశువు ఆచూకీ శుక్రవారం రాత్రి వరకూ లభించలేదు.
- పురోగతి లేని దర్యాప్తు
- రెండు రోజులైనా తెలియని శిశువు ఆచూకీ
- ఆస్పత్రి వదిలి వెళ్లేది లేద ంటున్న తల్లిదండ్రులు
- సిబ్బంది పాత్ర, వార్డులో చనిపోయిన శిశువుల తల్లుల వివరాలపై ఆరా
- తూతూ మంత్రంగా అంతర్గత విచారణ
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్ : కేజీహెచ్ ప్రసూతి వార్డులో బుధవారం తెల్లవారుజామున కనిపించకుండా పోయిన మగ శిశువు ఆచూకీ శుక్రవారం రాత్రి వరకూ లభించలేదు. ఈ సంఘటనలో బంధువుల పాత్రపై పోలీసులు చేపట్టిన దర్యాప్తు రెండు రోజులు కావస్తున్నా ఎలాంటి పురోగతీ కనిపించలేదు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ తీవ్రతరం చేశారు.
సంఘటన జరిగిన సమయంలో లేబర్ రూమ్, మ్యాటీ-2 వార్డులను ఆనుకొని ఉన్న గేట్‌కు తాళం వేయకపోవడం వల్లే శిశువు అపహరణ జరిగిందని శిశువు తల్లి, బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యం, శిశువు అపహరణ తర్వాత గేటుకు తాళం వేయడాన్ని బట్టి ఆరోజు విధుల్లో ఉన్న ఎఫ్‌ఎన్‌ఓ, ఫిమేల్ స్వీపర్ల పాత్రపై పోలీసులు దృష్టిసారించారు.
వార్డులో ఇద్దరు మగ బిడ్డలు చనిపోయిన విషయాన్ని పోలీసుల దర్యాప్తులో వెలుగుచూడడంతో ఆ శిశువులు చనిపోయిన తల్లుల వివరాలనూ పోలీసులు సేకరిస్తున్నారు. అయితే వారి చిరునామా వివరాలు ఆస్పత్రి రికార్డుల్లో నమోదు కాకపోవడంపై అనుమానాలు తలె త్తుతున్నాయి.
ఇదిలాఉండగా విచారణ పేరుతో పోలీసులు రాత్రి వేళల్లో లేబర్ రూమ్‌కు వచ్చి అక్కడ విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని బెదిరిస్తున్నారని, ఇలాగైతే ఆందోళన చేస్తామని లేబర్ రూమ్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. మరోవైపు, శిశువును పోగొట్టుకున్న తల్లిదండ్రులు బిడ్డ ఆచూకీ లభించే వరకూ ఆస్పత్రి నుంచి వెళ్లేది లేదని తెగేసి చెబుతుండడంతో ఈ కేసు మరింత జఠిలంగా మారింది.
తూతూ మంత్రంగా అంతర్గత విచారణ
మగ శిశువు మాయంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. ఈ సంఘటనపై లోతుగా విచారించి నివేదిక సమర్పించేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బి.ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో మెడిసిన్ ప్రొఫెసర్ కె.కృష్ణమూర్తి, సీఎస్ ఆర్‌ఎంఓ శాస్త్రిలను నియమించారు. వీరు విచారణ ప్రారంభించి 24 గడిచినా ఎలాంటి పురోగతీ లేదు. సిబ్బంది తీరును తప్పుబట్టలేక, బాధితులకు న్యాయం చేయలేక ఈ కమిటీ సంకట స్థితిలో పడింది. ప్రసూతి వార్డుల్లో బిడ్డ భద్రత కేవలం సిబ్బందికే కాకుండా తల్లి, కుటుంబ సభ్యులకు కూడా ఉందని కమిటీ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.


