ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను వాయిదా వేసినట్లు విద్యాశాఖ తెలిపింది.
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను వాయిదా వేసినట్లు విద్యాశాఖ తెలిపింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో సెప్టెంబర్ 1న నిర్వహించవలసిన ఈ పరీక్షను వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహించేది తరువాత తెలుపుతామని టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందిన తరువాత అధికారికంగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
ఇప్పటికే సీమాంధ్ర ఉద్యమ ప్రభావం సీమాంధ్ర జిల్లాల్లోని పాఠశాలలపై ఉండగా, ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలోని జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు కూడా సమ్మెకు దిగుతుండటంతో టెట్ వాయిదావేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ పరీక్ష రాసేందుకు 4 లక్షల 47 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.