తెలుగు తమ్ముళ్ల మల్కాజిగురి | telugu desam party leaders competition malkajgiri Lok sabha position | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల మల్కాజిగురి

Jan 1 2014 11:57 PM | Updated on Sep 27 2018 5:59 PM

తెలుగుదేశం పార్టీలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం ‘హాట్ సీటు’గా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో పార్టీ పరిస్థితి దిగజారినప్పటికీ, రంగారెడ్డి జిల్లాపై దాని ప్రభావం కనిపించడంలేదు.

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలుగుదేశం పార్టీలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం ‘హాట్ సీటు’గా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో పార్టీ పరిస్థితి దిగజారినప్పటికీ, రంగారెడ్డి జిల్లాపై దాని ప్రభావం కనిపించడంలేదు. సెటిలర్లు ఎక్కువగా ఉండడం... సంప్రదాయబద్ధంగా ఇక్కడి ఓటర్లు అండగా నిలుస్తుండడంతో టీడీపీ బలీయంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మల్కాజిగిరి పార్లమెంటరీ సీటుపై హేమాహేమీలు కన్నేశారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సహా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా ఇక్కడి నుంచి రేసులో ఉన్నట్లు  ప్రచారం జరుగుతుండగా...తాజాగా మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి కూడా బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్న మల్లారెడ్డి మనసులోని మాటను బయటపెట్టారు.

ఇప్పటివరకు పార్టీ తీర్థం పుచ్చుకోని మల్లారెడ్డి.. మల్కాజిగిరి సీటు కేటాయించాలని విన్నవించినట్లు తెలిసింది. మల్లారెడ్డి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు.. పార్టీ కోసం కష్టపడాలని హితోపదేశం చేసినట్లు సమాచారం. మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి సమీప బంధువు కూడా అయినా మల్లారెడ్డి మల్కాజిగిరి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చంద్రబాబు సహా రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్‌ను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మా రింది. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం తెలంగాణలో టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. కాస్తో కూస్తో బలమున్న రంగారెడ్డి జిల్లాపై భారీగా ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం... ఇక్కడ ఉన్న రెండు ఎంపీ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే మల్కాజిగిరి స్థానం నుంచి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బరిలోకి దిగుతారనే వార్తలు వినవస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీతో దాదాపు పొత్తు ఖ రారైన నేపథ్యంలో... తమ పార్టీకి కలిసి వస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి నుంచి పోటీ చే సి గెలుపొందడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఈ సారి పార్లమెంటులో అడుగిడేందుకు కుతూహలం ప్రదర్శిస్తున్నారు.

ఈ తరుణంలోనే ‘సేఫ్ జోన్’గా భావిస్తున్న రంగారెడ్డి జిల్లాలోని మల్కాజిగిరిపై ఆయన కన్నేశారు. ఇప్పటికే చాపకింద నీరులా దిగువశ్రేణి నాయకులతో మంతనాలు జరుపుతు మద్దతు కూడగడుతున్న రేవంత్...చంద్రబాబు బరిలో లేకపోతే తనకు సీటు ఖాయమనే విశ్వాసంతో ఉన్నారు. ఇదిలావుండగా.. తాజాగా మేడ్చల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మల్లారెడ్డి చంద్రబాబును కలవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement