స్వేచ్ఛ, సమానత్వం కోసమే తెలంగాణ ఉద్యమం సాగుతుంటే.. సమైక్యాంధ్ర ఉద్యమం ఆధిపత్యం కోరుకుంటుందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్
స్వేచ్ఛ, సమానత్వం కోసమే తెలంగాణ ఉద్యమం సాగుతుంటే.. సమైక్యాంధ్ర ఉద్యమం ఆధిపత్యం కోరుకుంటుందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్లగొండ సమీపంలోని ఎంజీ యూనివర్సిటీలో సోమవారం ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర’పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లేని తెలంగాణకు గుర్తింపు ఉండదన్నారు. హైదరాబాదులో సభపెట్టి రెచ్చగొట్టారని, అయినా తెలంగాణవాదులు సంయమనం పాటిం చారని తెలిపారు.
తెలంగాణ పౌర సమాజ స్వేచ్ఛను హరిస్తూ సీమాంధ్రులు హిట్లర్‌వాదుల్లా తయారయ్యారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను నిజాం అభివృద్ధి చేశారని, నిజాం వారసులు పరిశ్రమలు స్థాపించారని, కాలానికనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి జరిగిందన్నారు. సీమాంధ్రలో చేసిన అభివృద్ధి కేవలం వక్ఫ్‌భూములు, సర్కారు భూములు, పేదల భూములు లాక్కొని వారే అభివృద్ధి చెందారని విమర్శించారు. తెలంగాణ విషయమై ఎన్నో కమిటీలు వేశారని ఏ కమిటీ తమ లక్ష్యాన్ని నెరవేర్చలేదన్నారు. పాలకులు వైఫల్యం వల్లనే రాజ్యాంగం ప్రకారం రావాల్సిన అన్ని అవకాశాలు రావడం లేదన్నారు. తెలంగాణ ప్రకటన వచ్చినప్పటికీ ఈ ప్రాంత ప్రజలంతా సంకట స్థితిలో ఉన్నారని, ఆ ఆందోళనతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, జీవించి తెలంగాణ రాష్ట్ర పునః నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పర్చుకునే శక్తి జేఏసీకి ఉందని కోదండరాం అన్నారు. సీడబ్యూసీ నిర్ణయాన్ని అమలు చేయించే బాధ్యత తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులందరిపై ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు విషయమై నాయకులు విశ్వాసం కల్పించాలన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఫ్రొఫెసర్ జయశంకర్ నివాళులు
సమావేశం ప్రారంభంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం వహించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ జి. వెంకటేశ్వర్లు, యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ గుగులోతు రాంసింగ్, కన్వీనర్ బోయ భరత్, ప్రిన్సిపాల్ అంజిరెడ్డి, ప్రేమ్‌సాగర్, అల్వాల్ రవి, వసంత, విద్యార్థి నాయకులు సైదులు, దుబ్బరాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.