తుంగభద్ర ఆయకట్టులో కన్నీటి సేద్యం | Sakshi
Sakshi News home page

తుంగభద్ర ఆయకట్టులో కన్నీటి సేద్యం

Published Wed, Jul 31 2019 4:19 AM

Tearful Farming In the Tungabhadra rectory - Sakshi

(సాక్షి ప్రతినిధి, కర్నూలు): తుంగభద్ర జలాల కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రతి ఏటా అన్యాయమే జరుగుతోంది. విడుదల చేసిన నీళ్లు రాష్ట్రానికి చేరే విషయంలో మరింత దారుణంగా ఉంటోంది. కర్ణాటక రైతులు అడుగడుగునా నీటి చౌర్యానికి పాల్పడుతుండడంతో రాష్ట్ర రైతులు ఎండిన కాలువలు చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. కర్ణాటక జల చౌర్యం, అధికారుల నిర్లిప్తత వెరసి రాష్ట్రంలోని తుంగభద్ర ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతోంది. తుంగభద్ర డ్యామ్‌ నుంచి రాష్ట్ర (ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాలు) రైతుల తాగు, సాగు అవసరాల కోసం 56.5 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో హెచ్చెల్సీకి 32.5 టీఎంసీలు, ఎల్‌ఎల్‌సీకి 24 టీఎంసీలు కేటాయించారు. అయితే గత 20 ఏళ్లలో ఎప్పుడూ కూడా కోటా మేర నీళ్లు హెచ్చెల్సీ, ఎల్‌ఎల్‌సీకి వదల్లేదు.

ఇదీ హెచ్చెల్సీ పరిస్థితి
హెచ్చెల్సీ కాలువకు 32.5 టీఎంసీల నికరజలాలను తుంగభద్ర బోర్డు కేటాయించింది. ఈ నీటిపై కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాలో 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే టీబీబోర్డు మాత్రం ఏటా సగటున 18 టీఎంసీలు మాత్రమే ఇస్తామని ఐఏబీ సమావేశంలో నిర్ణయిస్తున్నారు. వాస్తవానికి ఆమేర కూడా అందించ లేకపోతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో 2006లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేసీ కెనాల్‌కు దక్కాల్సిన 10 టీఎంసీల నీటిని హెచ్చెల్సీకి మళ్లించేలా జీవో జారీ చేశారు. అందులో కూడా ఏటా 4 టీఎంసీలు మాత్రమే బోర్డు విడుదల చేస్తోంది. దీంతో ఏటా 20 టీఎంసీల నికరజలాలు సీమ రైతులు కోల్పోతున్నారు. తుంగభద్ర డ్యామ్‌ నుంచి ఏపీ సరిహద్దు వరకూ 105 కిలోమీటర్ల మేర కాలువ కర్ణాటకలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని రైతులు ఏటా జలచౌర్యానికి పాల్పడుతున్నారు. ఎక్కడికక్కడ పైపులు వేసుకుని మోటర్ల ద్వారా వాడేసుకుంటున్నారు.

హెచ్చెల్సీ నుంచి ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా కర్నూలుకు, పీబీసీ (పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌), మైలవరం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా వైఎస్సార్‌ జిల్లాకు తుంగభద్రజలాలు చేరాలి. ప్రధాన కాలువ ద్వారా అనంతపురంలోని పీఏబీఆర్, ఎంపీఆర్‌ డ్యామ్‌కు నీరు చేరుతుంది. అయితే విడుదల చేసిన జలాలు కాలువ చివరి ఆయకట్టు వరకూ వెళ్లడం లేదు. దీంతో తమ వాటా జలాలు దక్కడంలేదని రైతులు ఏటా ఆందోళనలకు దిగుతున్నారు. పీబీసీ ఆయకట్టుకు 8 ఏళ్లుగా  చుక్కనీరు అందడంలేదు. విడుదలయ్యే అరకొర నీరు తాగునీటి అవసరాలకే సరిపోతోంది. ఫలితంగా పులివెందుల ప్రాంతంలో పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  

ఎల్‌ఎల్‌సీ పరిస్థితి ఇదీ
ఎల్‌ఎల్‌సీ (లోలెవల్‌ కెనాల్‌)కి డ్యామ్‌ నుంచి 24 టీఎంసీలు కేటాయింపులున్నాయి. ఈ నీటిపై ఆధారపడి కర్నూలు జిల్లాలో 1.51లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. గత ఏడేళ్లుగా కేటాయింపులు పరిశీలిస్తే 6 టీఎంసీల నుంచి 15 టీఎంసీల లోపే ఉన్నాయి. ఇందులో కూడా 3.5 టీఎంసీలు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన నీటినే సాగుకు వినియోగించాలి. దీంతో ఎల్‌ఎల్‌సీ కింద ఎప్పుడూ సగం మేర ఆయకట్టుకు నీరందడం లేదు.  

ఈ ఏడాది పరిస్థితులు మరీ దారుణం
టీబీడ్యాంలో నీటి నిల్వల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గతేడాది ఈ సమయానికి 94.01 టీఎంసీలు ఉంటే, ప్రస్తుతం డ్యాంలో 24.44 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గతేడాది డ్యాంలో ఇన్‌ఫ్లో 54,380 క్యూసెక్కులు, ఉంటే ఈ ఏడాది 14,683 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. దీంతో ఎల్‌ఎల్‌సీ ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి తోడు వర్షాలు కూడా లేకపోవడంతో ఈ ఏడాది పంటలు లేనట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement