
కృత్రిమ నేత నారా లోకేశ్ ఎక్కడ?
కృత్రిమ నేత నారా లోకేశ్ నంద్యాల ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
నంద్యాల: వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ సభలకు స్వచ్ఛందంగా తరలివస్తున్న జనాలను చూసి అధికార పార్టీ నేతలు బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. సభలకు జనం రాకుండా చేయాలనే కుట్రతో డబ్బులిచ్చి ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు అలవాటేనని ధ్వజమెత్తారు.
కృత్రిమ నేత నారా లోకేశ్ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విజ్ఞత కోల్పోతున్నారని, కార్యకర్తపై ఆయన చేయిచేసుకోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉండి డబ్బు పంచడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రాజకీయాలను చంద్రబాబు దిగజారుస్తున్నారని మండిపడ్డారు. భూమా కుటుంబాన్ని వైఎస్ జగన్ అన్నివిధాలుగా ఆదరిస్తే చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. అఖిలప్రియకు చెప్పకుండానే గంగుల ప్రతాప్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. అఖిలప్రియ ఇప్పటికైనా వాస్తవం తెలుసుకోవాలన్నారు.
మైనార్టీల సంక్షేమం కోసం చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం ఒక్క మైనార్టీ ఎమ్మెల్యేను చంద్రబాబు గెలిపించుకోలేకపోయారని, మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూడటం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. 'చంద్రబాబుకు కాకినాడలో బీజేపీతో పొత్తు కావాలట, నంద్యాలలో మాత్రం బీజేపీ జెండాలతో తిరగొద్దట. మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేద'ని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
పవన్ నిర్ణయం శుభపరిణామం
ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవడం శుభ పరిణామమని శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మూడున్నరేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి, దోపిడీ గురించి పవన్‌కు తెలిసివుంటుందన్నారు. జనసేన, పవన్ అభిమానులు.. చంద్రబాబు అవినీతి గురించి తెలుసుకోవాలని సూచించారు.