కాగితాలు దాటని రూ.కోట్లు

TDP Government Delayed GVMC Funds - Sakshi

ఆర్థిక సమస్యలతో జీవీఎంసీ అగచాట్లు

ఎడాపెడా జీవోలు.. విడుదల కాని నిధులు

ఎన్నికల తరుణంలో రాష్ట్ర సర్కారు మాయాజాలం

ఇంతకుముందు నుంచీ ఇదే తీరు.. ఇప్పుడు మరీ జోరు

పెండింగ్‌ బిల్లులకు సైతం నిధులు రాల్చని ప్రభుత్వం

పనులు.. పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలను నాలుగున్నరేళ్లపాటు తొక్కిపెట్టేసిన టీడీపీ సర్కారు.. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న స్వార్థచింతనతో ఇటీవల ఒక్కసారిగా గేట్లు ఎత్తేసింది. ఎడాపెడా పథకాలు, పనులు ప్రకటించడమే కాకుండా.. శంకుస్థాపన రాళ్లు కూడా వేసేస్తోంది.తాత్కాలిక ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్కారు.. అదే సమయంలో అవసరమున్న.. ఇంతకుముందు నుంచే అమల్లో ఉన్న పనులు, పథకాలను ఎండబెట్టేస్తోంది.కొత్త పనులకు నిధులు విదల్చకపోగా.. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటికీ బిల్లులు చెల్లించకుండా కాగితాల్లోనే మురగబెడుతోంది.మహావిశాఖ నగరపాలక సంస్థనే తీసుకుంటే.. పలు పనులకు నిధులు మంజూరు చేసినట్లు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం.. వాటికి సంబంధించి రూ.252 కోట్లలో ఇప్పటికీ ఒక్కపైసా అయినా రాల్చలేదు..ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పనులకు సంబంధించి సుమారు రూ.46 కోట్ల బిల్లులను పెండింగులో పడేసింది.ప్రభుత్వంపై నమ్మకంతో ఇబ్బడిముబ్బడిగా పనులు చేపట్టిన జీవీఎంసీ అధికారవర్గాలు ఖజానాలో కాసుల్లేక కలవరపడుతున్నారు.

విశాఖసిటీ:  ‘ఏంటో సార్‌.. పన్నులు వసూలవుతున్నాయే కానీ.. వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్లిపోతోంది. ఒక్క రూపాయి కూడా ఖజానాలో ఉండటం లేదు. వడ్డీ మాఫీ జీవో వచ్చినప్పటి నుంచి పన్నులు చెల్లించే వారు కూడా సమయం ఉందనే దీమాతో చెల్లించడం మానేశారు. ప్రభుత్వమేమో.. జీవో మీద జీవో జారీ చేస్తూ జీవీఎంసీకి కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెబుతోందే తప్ప ఒక్క రూపాయి కూడా అకౌంట్‌లో వెయ్యడం లేదు.  ఇలాగైతే చాలా కష్టమండీ...’

ఇవీ.. జీవీఎంసీలోని ఓ ప్రధానాధికారి అసహనంతో చేసిన వ్యాఖ్యలు.
నిజమే.. జీవిఎంసీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోజు ఆదాయం ఎంత వచ్చింది? ఏ పనులకు ఎంత చెల్లించాలనే లెక్కలేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రభుత్వమే. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడం ఒకటైతే.. నిధులు మంజూరు చేసినట్లు వరుస జీవోలు జారీ చేస్తున్నా.. వాటికనుగుణంగా పైసా విదల్చకపోవడం మరో కారణం.

జీవోలు తప్ప నిధులేవీ?
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జీవీఎంసీ పరిధిలో వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీనికి తోడు స్మార్ట్‌సిటీ, అమృత్, ఏడీబీ, ఏబీడీ ప్రాజెక్టుల పనులూ జరుగుతున్నాయి. వీటికి నిధుల విడుదలలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. జీవీఎంసీ విషయంలోనూ అదే మాయ చేస్తోంది. గత ఆరు నెలల్లో సుమారు రూ.252 కోట్లు మంజూరు చేస్తూ పదుల సంఖ్యలో జీవోలు జారీ చేసింది. అయితే ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. నిధులు విడుదల చేయాలని జీవీఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదు.

పెండింగ్‌ బిల్లులకూ మోక్షం లేదు
జీవోల్లో చెప్పిన నిధులే కాదు.. కార్పొరేషన్‌కు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల మంజూరులోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన పనులు పూర్తి చేసి బిల్లుల కోసం నివేదికలు పంపినా స్పందించడం లేదు. అకౌంట్స్‌ ఫ్రీజింగ్‌లో ఉండటం వల్ల బిల్లులు మంజూరు కావడం లేదని ఆర్థిక శాఖ చెబుతోంది. ఇప్పటికే పెండింగులో ఉన్న రూ.46 కోట్లు చెల్లించాలని గత ఆరు నెలలుగా కోరుతున్నా ఫలితం లేకపోతోంది.

పన్ను రాలడం లేదు..?
జీవీఎంసీ ప్రధాన ఆదాయ వనరులైన పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంతో నగరంలో పలు పనులు చేపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పన్నుల వసూళ్లలో మొదట్లో వేగం పెంచిన జీవీఎంసీ.. ఒక్కసారిగా చతికిలపడింది. బకాయిలున్న ఆస్తి పన్నులకు సంబంధించి వడ్డీ మాఫీ చేస్తూ సర్కారు జీవో జారీ చేయడంతో పన్ను చెల్లింపులు నిలిచిపోయాయి. మార్చి 31 వరకూ సమయం ఉండటంతో ఆలస్యంగా చెల్లించినా ఫర్వాలేదనుకుంటూ చాలా మంది నగర వాసులు పన్నులు చెల్లించడం మానేశారు. వడ్డీ ద్వారా వచ్చే సుమారు 20 కోట్ల రూపాయల ఆదాయాన్ని  ఈ జీవో వల్ల కార్పొరేషన్‌ కోల్పోయింది. దీంతో కార్పొరేషన్‌ ఆర్థిక పరిస్థితి దిగజారిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

గతంలోనూ ఇదే తీరు
నమ్మించి మోసం చెయ్యడం ప్రభుత్వానికి కొత్త కాదు. జీవీఎంసీకి కుచ్చుటోపీ పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. 2014లో హుద్‌హుద్‌ ధాటికి ధ్వంసమైన నగర పునర్నిర్మాణానికి జీవీఎంసీ నిధులు ఖర్చు చెయ్యాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్కారు ఆదేశాల మేరకు వివిధ అభివృద్ధి పనులకు మొత్తం 21,78,04,314 రూపాయల మేర ఖర్చు చేసి.. ఆ వివరాలతో జీవీఎంసీ నివేదిక పంపింది. దీనికి స్పందించిన ప్రభుత్వం నెల రోజుల్లో రూ.7.35 కోట్లు.. మూడేళ్ల తర్వాత మరో 7 కోట్లు విడుదల చేసి.. వాటితోనే సర్దుకుపోవాలని చెప్పినట్లు గ్రేటర్‌ వర్గాలు చెబుతున్నాయి. అలాగే గ్రేటర్‌ ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతూ.. ఒక్కో నియోజకవర్గంలో రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు రూ.50 కోట్ల విలువైన పనులు చేపట్టి.. ఆ నిధులను మంజూరు చేయాలని జీవీఎంసీ నివేదించింది. అయితే సర్కారు రూ.25 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఐదేళ్ల తలసరి ఆదాయం రూ.40 కోట్లు, నాన్‌ ప్లాన్‌ గ్రాంటు రూ.100 కోట్లు కూడా ఇవ్వకుండా జీవీఎంసీని ఆర్థికంగా తొక్కేస్తోందని ఉద్యోగులు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top