తమ్మిలేరుపై ఆధునికీకరుణ 

Tammileru Renovation Works Starts After Tenders Finalised In West Godavari - Sakshi

మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన తమ్మిలేరు ఆధునికీకరణ వైపు అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ జలాశయం పనులపై ఇప్పుడు అధికారులు దృష్టిసారించారు. నవంబర్‌లో పనులు చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సాక్షి, పశ్చిమగోదావరి(చింతలపూడి) : తమ్మిలేరు ప్రాజెక్టు ఆధునికీరణ నిమిత్తం జపాన్‌ ఆర్థిక బ్యాంక్‌ నుంచి గత ఏడాది రూ.16.91 కోట్ల రుణం మంజూరైంది. అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు మొదలు కాలేదు. ఇప్పుడు  అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీఓటీ)కి పంపించారు. వీటిని ఉన్నతాధికారులు పరిశీలించి ఖరారు చేస్తారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టెండర్ల ప్రక్రియలో స్వల్ప జాప్యం జరిగే ఆస్కారం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 329 అడుగుల మేర నీరు చేరింది. వర్షాలు  కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. టెండర్లు ఖరారు అయితే  నవంబర్, డిసెంబర్‌ నుంచి పనులు చేపట్టే అవకాశం ఉంది. మంజూరు అయిన నిధులతో  జలాశయ ఆనకట్ట, ప్రాజెక్టు  కుడి, ఎడమ కాల్వలతోపాటు  ప్రధాన పంట కాల్వలు, ఇరిగేషన్‌ కార్యాలయాలనూ  నిర్మించనున్నారు. మొత్తం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు చేపడతారు. వాటిలో  మన జిల్లాలోని తమ్మిలేరు ప్రాజెక్టుతోపాటు దీనికింద ఉన్న కొన్ని చెరువుల ఆధునికీకరణ పనులూ చేపడతారు.

30వేల ఎకరాలకు లాభం 
పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో  సుమారు 30 వేల ఎకరాలకుపైగా  సాగునీరు అందిస్తున్న తమ్మిలేరు ప్రాజెక్టు ప్రస్తుతం మెరక తేలి ఉంది. దీంతో 3 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ఇప్పుడు రెండు టీఎంసీల నీరూ నిల్వ ఉండని దుస్థితి నెలకొంది. చింతలపూడి ఎత్తిపోతల పధకం నీరు ప్రాజెక్టులోకి మళ్లించే నాటికన్నా జలాశయంలో ఆక్రమణలు తొలగించి, పూడిక తీసి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంది.  ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్ళు దాటిపోయినా ఇంత వరకూ పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టలేదు. 1996లో వచ్చిన పెను తుపానుకు ప్రాజెక్టు గట్టు రివిట్‌మెంట్‌ పూర్తిగా ధ్వంసమైంది. అప్పట్లో రూ.1.55 కోట్లతో  మరమ్మతులు చేశారు. 

గట్టు బలహీనం 
ప్రస్తుతం జలాశయం గట్టు బలహీనంగా ఉంది. గట్టుపైకి చేరుకునే మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. సాగునీరు అందించే పంట కాలువలూ దెబ్బతిన్నాయి. రిజర్వాయర్‌ కుడి కాలువ 6.508 కిలోమీటర్లు, ఎడమకాలువ 10.185 కిలోమీటర్లు, మంకొల్లు కాలువ పొడవు 3.38 కిలోమీటర్లు. వీటిని ఆధునికీకరించనున్నారు.  ఈ జలాశయం వద్ద కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ 6.4 కిలోమీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు,74 మీటర్ల ఎత్తులో మట్టికట్టను నిర్మించారు. మట్టికట్టనూ పటిష్టపరచడానికి  చర్యలు తీసుకుంటున్నారు.

2006లోనే ప్రతిపాదనలు 
ఇరిగేషన్‌ అధికారులు తమ్మిలేరు అభివృద్ధికి 2006లో రూ.23 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ తరువాత జపాన్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ కో–ఆపరేటివ్‌ ఎయిడ్‌ (జేఐసీఏ) అనే సంస్థ నిధులతో తమ్మిలేరు ఆధునికీకరణకు అన్ని అనుమతులు వచ్చాక నిధుల విడుదలకు నిర్దేశించిన సమయం పూర్తి కావడంతో మరమ్మతులు ప్రారంభం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనికి కేంద్ర జలసంఘం అనుమతులు లభించి నిధులు మంజూరు కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, రాష్ట్ర విభజన జరగడంతో ఈ నిధులపై మళ్ళీ నీళ్ళు వదులు కోవలసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం తమ్మిలేరు ప్రాజెక్టును అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తించింది. అనంతరం అంతర్రాష్ట్ర కోటాలో తమ్మిలేరు అభివృద్ధికి నిధులు కేటాయించాలని 2015లో మరోసారి కేంద్ర జలసంఘం అనుమతి కోసం జిల్లా ఇరిగేషన్‌ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. 

జపాన్‌ బృందం ప్రాజెక్టు సందర్శన
ఈ నేపథ్యంలోనే 2016 ఫిబ్రవరిలో జపాన్‌ ఆర్థిక బ్యాంకు బృందం ప్రాజెక్టును పరిశీలించి వెళ్లింది. తమ్మిలేరుతో పాటు జిల్లాలోని 20 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులనూ పరిశీలించింది. ఆ తర్వాత జపాన్‌ బ్యాంకు రుణం మంజూరు చేసింది.  

ఉద్యోగుల క్వార్టర్లు శిథిలం
తమ్మిలేరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇక్కడ  ఇరిగేషన్‌ డీఈ కార్యాలయంతోపాటు, ఒక గెస్ట్‌హౌస్, అధికారులు, సిబ్బంది కోసం భవనాలు నిర్మించారు. సుమారు ఏడు కార్యాలయాలను వేర్వేరుగా నిర్మించారు. ప్రాజెక్టు పర్యవేక్షణకు వచ్చే ఉన్నతాధికారులు ఇక్కడున్న గెస్ట్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ ఇరిగేషన్‌ శాఖకు చాలా ఎకరాల మేర సొంత స్ధలం కూడా ఉంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత నీటిపారుదల శాఖకు చెందిన ఉద్యోగులతో పాటు, సెక్షన్‌ కార్యాలయాన్ని ఏలూరుకు తరలించడంతో అంతవరకూ ఉద్యోగులు నివాసం ఉన్న భవనాలు ఖాళీ అయ్యాయి. ఆ తరువాత సంబంధిత అధికారులెవరూ ఈ భవనాలను గురించి పట్టించుకో లేదు. దీంతో అవి శిథిలమయ్యాయి. వీటిల్లోని కలప దొంగలపరమైంది. 

కబ్జాలో స్థలాలు 
ప్రస్తుతం కొన్ని భవనాల్లో రిటైర్డ్‌ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. ఇరిగేషన్‌ శాఖ విలువైన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. నిజానికి వరదలు, తుపాన్లు సంభవించినప్పుడు అత్యవసర సమయాల్లో ప్రాజెక్టును అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. అందుకోసం ఇక్కడ అధికార యంత్రాంగం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
 సెక్షన్‌ కార్యాలయం ఏలూరు తరలించడంతో తమ్మిలేరులో ఆక్రమణలు పెరిగాయి.  ప్రస్తుతం మంజూరైన నిధులతోపాటు ప్రభుత్వం  మరికొన్ని నిధులు జోడించి ఈ క్వార్టర్లను ఆధునికీకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు.  

టెండర్లు ఖరారు కావాల్సి ఉంది
జపాన్‌ బ్యాంకు నుంచి నిధులు మంజూరయ్యాయి. ఉన్నతాధికారులు టెండర్లు ఖరారు చేయాలి. నవంబర్‌ నాటికి పనులు మొదలయ్యే అవకాశం ఉంది.
– ఎం.అప్పారావు, ఇరిగేషన్‌ డీఈ, తమ్మిలేరు 

పనులు ప్రారంభించాలి
తమ్మిలేరు అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించాలి. ప్రాజెక్టు మరమ్మతు పనులు చేపట్టి చాలా ఏళ్లయింది. తమ్మిలేరుకు శాశ్వత సాగునీటి జలాలను తరలించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి తమ్మిలేరుకు సాగు నీరు అందించాలి.
– జంగా మురళీధర్‌రెడ్డి, తమ్మిలేరు సాగునీటి సంఘం చైర్మన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top