ఆ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేల జరిమానా

Talking to the MLC is a fine of Rs 10 thousand - Sakshi

సొంతూరునే దూషించిన టీడీపీ నేత విషయంలో మత్స్యకారుల కట్టుబాటు

కావలి : ఆ ఎమ్మెల్సీతో నేరుగా మాట్లాడితే రూ.10వేలు.. ఫోన్లో మాట్లాడితే రూ.3వేల జరిమానా విధించాలని అక్కడి గ్రామస్తులు కట్టుబాటు విధించారు. తమ గ్రామాన్ని ఉద్దేశించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళ్తే.. కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో శివాలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా మంగళ, బుధ, గురువారాలు ప్రత్యేక కార్యక్రమాలను తలపెట్టారు. తొలిరోజు స్థానిక ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరయ్యారు.

ఈ గ్రామం సమీపంలోని ఇస్కపల్లిపాలేనికి చెందిన మత్స్యకారులూ తరలివచ్చారు. ఇంతలో.. ‘ఇలాంటి దరిద్రపు ఊరు జిల్లాలో లేదు’.. అంటూ రవిచంద్ర తన స్వగ్రామం ఇస్కపల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాక.. మత్స్యకార మహిళల వద్ద మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ‘మేం దరిద్రపు వాళ్లమా, 30 ఏళ్లుగా మా గ్రామాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయంగా రాష్ట్రస్థాయికి ఎదిగి, మమ్మల్ని దూషిస్తావా’.. అంటూ మండిపడ్డారు. కలశాల్లో సముద్రపు నీరు ఇవ్వబోమని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని వారు హెచ్చరించారు. అనంతరం ఇస్కపల్లిపాలెంలో మత్స్యకారులంతా సమావేశమయ్యారు. బీద రవిచంద్రతో మాట్లాడితే రూ.10,000, ఫోన్‌లో మాట్లాడితే రూ.3,000 జరిమానా చెల్లించాలని మత్స్యకారులు కట్టుబాటు పెట్టుకున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top