లంబూ.. జంబూ! | students suffering sarva shikha abhiyan school uniform sizes | Sakshi
Sakshi News home page

లంబూ.. జంబూ!

Oct 18 2017 7:29 AM | Updated on Oct 18 2017 7:29 AM

ప్రభుత్వం వస్త్రం ఇచ్చింది.. ఎలాగోలా కుట్టేయే.. సరిపోతే మాకేం సరిపోకపోతే మాకేం అన్నట్టు కుట్టేశారు.. రెండేళ్ల క్రితం పిల్లల వద్ద  తీసుకున్న కొలతలతోనే వస్త్రాలను కుట్టి పంపుతున్నారు. ఫలితంగా కుట్టిన దుస్తులు పిల్లలకు సరిపోక కొన్ని, లంబూ జంబూగా మరికొన్ని, మరీ బిగుసుగా కొన్ని రావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వీటి గురించి పర్యవేక్షించేవారు లేరు.. పట్టించుకునేవారు అసలే లేరు. ఫలితంగా విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.

కడప ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సర్వశిక్ష అభియాన్‌ నిధులతో ప్రభుత్వం యూనిఫాం పంపిణీ చేస్తోంది. విద్యార్థుల్లో గైర్హాజరు శాతం తగ్గించి వారు పాఠశాలల వైపు ఆకర్షితులయ్యేలా చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం పక్కదారి పడుతోంది. వస్త్రం నాణ్యతను గాలికొదిలేయడంతో సరఫరాదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. నాసిరకం దుస్తులు ఇచ్చి పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నా విద్యాశాఖ యంత్రాం గానికి పట్టడం లేదు. ఎవరైనా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు ఆ దుస్తులు సరిగా లేవని వాటిని తీసుకోవడానికి తిరస్కరించినా పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. ఒక్కో విద్యార్థికి రూ. 4 వందల చొప్పున యూనిఫాంకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఇచ్చేటప్పుడు ఆ వ్యయంతో నాణ్యమైన దుస్తులు సమకూర్చుకోవచ్చనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో..
తొలుత ఎక్కడికక్కడ పాఠశాలల వారీగా వస్త్రం సమకూర్చుకొని ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో వాటిని కుట్టించి ఇవ్వడంతో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాలేదు. ఈ పద్ధతి బాగున్నా కొందరు ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లకు నచ్చలేదు. ఇలాగైతే తమ జేబులు నిండవని ఈ విధానానికి స్వస్తి చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఈ విధానంలో వస్త్ర నాణ్యత మొదలుకుని దాని సరఫరా దాకా పరిశీలిస్తే అడుగడుగునా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పాఠశాలలు తెరిచి దాదాపు నాలుగు నెలలైనా ఇప్పటికి కేవలం 21 మండలాల్లోని పాఠశాలలకు మాత్రమే దుస్తులను సరఫరా చేశారు. ఇంకా 30 మండలాల్లో పంపిణీ చేయాల్సి ఉంది. అది కూడా రెండేళ్ల క్రితం తీసుకున్న కొలతలతో దుస్తులు కుట్టారు.

పంపిణీ చేసిన వాటిలో చాలా మేరకు పిల్లలకు సరిపోవడం లేదని తెలిసింది. కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెనక్కు పంపుతున్నారు. జిల్లాలోని బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లో చాలా పాఠశాలల్లో పిల్లలకు దుస్తుల సైజులు సరిపడక వెనక్కు పంపారు.  తాజాగా కడప నగరం నాగరాజుపేట నగర పాలక పాఠశాలలో విద్యార్థులకు పంపిన దుస్తులు సరిపడక 8వ తరగతి చదివే విద్యార్థుల దుస్తులు 6వ తరగతి విద్యార్థులకు.. 6వ తరగతి చదివే పిల్లల దుస్తులు 4వ తరగతి వారికి పంపిణీ చేశారు. ఇందులోనూ ఒక్కో విద్యార్థికి రెండు జతలు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం ఒక జతతోనే సర్దుబాటు చేశారు.

జిల్లాలో మూడు కేంద్రాల్లో యూనిఫాం తయారీ
పిల్లలకు సంబంధించి స్కూల్‌ యూనిఫాంను జిల్లాలో మూడు కేంద్రాలలో తయారు చేస్తున్నారు. కడపలో మెప్మా ఆధ్వర్యంలో, అలాగే ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని కుట్టు కేంద్రంతోపాటు ఖాజీపేటలోని నందిని ఫ్యాబ్రిక్స్‌లో పిల్లల యూనిఫాంలను కుడుతున్నట్లు అధికారులు తెలిపారు.

1లక్షా 76 వేల 180 మంది విద్యార్థులు
ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్‌ పాఠశాలలతో పాటు కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను కలుపుకుని 1 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులు 1,76,180 మంది ఉన్నారు. వీరి నుంచి ముందస్తుగా సైజులు, కొలతలు తీసుకుని యూనిఫాం కుట్టించి ఇచ్చి ఉంటే దుస్తులు సరిపోవడం లేదు అనే సమస్య ఎదురయ్యేది కాదు. అలాగే ఒక్కో పాఠశాలలో ఎంతమంది పిల్లలు ఉన్నారు. వారికి సరపడా దుస్తులు ఇస్తున్నామా లేదా అనే లెక్క కూడా ఉండటం లేదు. వస్త్రం నాణ్యత మొదలుకుని కుట్టు, సరఫరా దాకా ప్రతి విషయంలోనూ లోపాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement