ఎస్‌ఎస్ ట్యాంకులో పడిన విద్యార్థి | student fall in the tank | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్ ట్యాంకులో పడిన విద్యార్థి

Feb 13 2015 1:46 AM | Updated on Nov 9 2018 5:02 PM

ఎస్‌ఎస్ ట్యాంకులో పడిన విద్యార్థి - Sakshi

ఎస్‌ఎస్ ట్యాంకులో పడిన విద్యార్థి

ఒంగోలుకు రక్షిత మంచినీటిని అందించే ఎస్‌ఎస్ ట్యాంకు-2లో గురువారం సాయంత్రం 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రమాదవశాత్తు పడిపోయాడు.

ఒంగోలు క్రైం : ఒంగోలుకు రక్షిత మంచినీటిని అందించే ఎస్‌ఎస్ ట్యాంకు-2లో గురువారం సాయంత్రం 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రమాదవశాత్తు పడిపోయాడు. నగరంలోని సాయిబాబా సెంట్రల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న పిన్నిక సాయి అనుదీప్ ఎస్‌ఎస్ ట్యాంకు పక్కన తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకున్నాడు. ఒంగోలు అన్నవరప్పాడుకి చెందిన అనుదీప్ ముగ్గురు స్నేహితులతో కలిసి ఎస్‌ఎస్ ట్యాంకు కట్టపైకి ఎక్కి చూస్తుండగా చేతులో ఉన్న సెల్ కిందపడిపోయింది. అది జారుకుంటూ ఎస్‌ఎస్ ట్యాంకు నీళ్ల అంచువద్దకు వెళ్లింది. ఆ సెల్‌ఫోన్ తీసుకునేందుకు కట్టపై నుంచి నీళ్ళ వద్దకు ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో దిగాడు. ప్రమాదవశాత్తు కాలుజారి నీళ్ళలో పడ్డాడు. ఈత రాకపోవడంతో అనుదీప్ నీళ్ళలో నీట మునిగిపోయాడు.

కట్ట మీద ఉన్న అతని స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. కట్ట పక్కనే క్రికెట్ ఆడుతున్న మిగతా స్నేహితులు కూడా పరిగెత్తుకుంటూ కట్టపైకి ఎక్కారు. ఎవరికీ ఈత రాకపోవడంతో చేసేది లేక కేకలు వేయడంతోనే సరిపెట్టారు. సాయిబాబా సెంట్రల్ స్కూలు విద్యార్థులకు వెంగముక్కలపాలెం రోడ్డులోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం సైన్స్‌ఫేర్ ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ ఫేర్ కోసం క్విస్ కాలేజీకి వచ్చిన విద్యార్థులు సాయంత్రం ఎస్‌ఎస్ ట్యాంకు-2 పక్కనే ఉన్న క్రికెట్ గ్రౌండుకి ఆడుకోవడానికి వచ్చారు.

క్రికెట్ ఆడిన తరువాత కట్టపైకి ఎక్కడంతో  ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న తాలూకా సిఐ ఎస్ ఆంటోని రాజ్ తన సిబ్బందితో ఎస్‌ఎస్ ట్యాంకు వద్దకు చేరుకున్నారు. హుటాహుటిన గజ ఈతగాళ్ళను పిలిపించి గాలింపు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు వెతికినా మృతదేహం లభ్యం కాలేదు. ఈ సమాచారాన్ని అనుదీప్ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఘటనా స్థలంలో మృతుడి తల్లిదండ్రులు, సహ విద్యార్థుల రోదనలతో విషాదం చోటుచేసుకుంది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement