చెత్తశుద్ధి కరువాయే.. భరించలేని బరువాయే | Sakshi
Sakshi News home page

చెత్తశుద్ధి కరువాయే.. భరించలేని బరువాయే

Published Fri, Oct 20 2017 11:04 AM

still dumping yards space not yet in districts

టన్నుల్లో పోగుపడి కొండల్లా పేరుకుపోతున్నచెత్త జిల్లాను వణికిస్తోంది. ఏళ్ల తరబడి డంపింగ్‌యార్డుల కోసం చేపట్టిన అన్వేషణ ఓ కొలిక్కిరావడం లేదు. దీంతో పాలకవర్గాలకు చెత్త నిర్వహణ తలనొప్పిగా మారింది. ఈలోగా పందులు, దోమల స్వైర విహారంతో ప్రజలు భయపడుతున్నారు. రోగాలు విజృంభిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. స్వచ్ఛభారత్‌ అంటూ ప్రభుత్వాలు హడావుడి చేస్తున్నా టన్నుల్లో భారం.. కొంతైనా తరగడం లేదు. ప్రభుత్వానికి బొత్తిగా చెత్తశుద్ధిలేదంటూ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా..

నగరంలో కార్మికులపై ఒత్తిడి
ఏలూరు(సెంట్రల్‌): నగరపాలకసంస్థ పరిధిలో మొత్తం 50 డివిజన్లలో సుమారు 55 వేల ఇళ్లు ఉన్నాయి. రోజూ సుమారు 80 టన్నుల చెత్తను పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తున్నారు. ఈ చెత్తనంతా నగర శివారు పొణింగ్‌ ప్రాంతంలోని 18 ఎకరాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుకు 18 ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. 190 మంది పర్మినెంట్‌ సిబ్బంది ఉండగా 270 మంది కాంట్రాక్ట్‌ సిబ్బంది నగరంలో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటున్నారు. ఏటా పారిశుద్ధ్య పనులకు నగరపాలక సంస్థ రూ.30 లక్షలు ఖర్చు చేస్తోంది. నగరంలో 2.12 లక్షల మంది జనాభాకు గాను చెత్త సేకరణకు ఇంకా 100 మంది అదనపు సిబ్బంది అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.

యనమదుర్రు కాలువగట్టుపై..
భీమవరం టౌన్‌: మున్సిపాలిటీ పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో రోడ్లపై చెత్త తగ్గినప్పటికీ గొల్లవానితిప్ప రోడ్డులోని యనమదుర్రు కాలువగట్టుపై గుట్టలుగా సుమారు కిలోమీటరు దూరం దర్శనమిస్తోంది. మున్సిపాలిటీకి నిధుల కొరతలేనప్పటికీ డంపింగ్‌యార్డును సమకూర్చుకోలేని పరిస్థితి. 25.64 చ.కిమీ కలిగిన పట్టణంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,47,188 మంది జనాభా ఉన్నారు. రోజుకు 81 టన్నుల చెత్తపోగవుతోంది. 417 మంది పారిశుద్ద్య సిబ్బంది రోజుకు 78.50 టన్నుల వ్యర్థాలను తొలగిస్తున్నారు. డంపింగ్‌యార్డు లేకపోవడంతో సేకరించిన చెత్తను ట్రాక్టర్లలో గొల్లవానితిప్పరోడ్డులోని యనమదుర్రు కాలువగట్టుపై డంప్‌ చేస్తున్నారు. ఇటీవల కేంద్రం నిర్వహించిన స్వచ్చ సర్వేక్షణ సర్వేలో పట్టణానికి 87వ ర్యాంకు లభించింది. 2007లో యనమదుర్రు గ్రామంలో రూ.80 లక్షలతో 14.5 ఎకరాలను డంపింగ్‌యార్డు నిమిత్తం మున్సిపాలిటీ కొనుగోలు చేసింది. అయితే కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సమస్య పెండింగ్‌లో ఉంది.

తడి పొడి.. మొక్కుబడి
తణుకు : పట్టణంలో మొత్తం 34 వార్డుల నుంచి నిత్యం దాదాపు 50 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు 8 ట్రాక్టర్లు, నాలుగు ఆటోలను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా తడి, పొడి చెత్తను సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించడానికి పురపాలక సంఘం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మొత్తం నాలుగు డివిజన్లలో ప్రయోగాత్మకంగా తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమం తలపెట్టారు. ఈ పరిస్థితుల్లో 2004లోనే తణుకు పట్టణంలో చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు ప్రత్యేక యూనిట్‌ నెలకొల్పినప్పటికీ ప్రస్తుతం వినియోగంలో లేదు. ఇందుకోసం 9 ఎకరాల్లో డంపింగ్‌ యార్డు నెలకొల్పగా చెత్తను మాత్రం రీ సైక్లింగ్‌ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కలగా విద్యుత్‌ ప్లాంట్‌
తాడేపల్లిగూడెం: సంవత్సరాలు గడుస్తున్నా గూడెం మున్సిపాలిటీకి డంపింగ్‌ కోసం స్థలం దొరకని పరిస్థితి. పట్టణంలో రోజుకు వచ్చే చెత్త 80 టన్నులు. ప్రస్తుతం చెత్తను విమానాశ్రయ భూములకు దగ్గరగా ఉన్న భూముల్లో దగ్గరగా డంప్‌ చేస్తున్నారు. 2014లో తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను ప్రాంతంలో మూడెకరాల 20 సెంట్ల భూమిని మున్సిపాలిటీ డంపింగ్‌ అవసరాల కోసం రూ.44 లక్షలు ప్రభుత్వానికి చెల్లించారు. వేస్టు ఎనర్జీ ప్లాంటు కోసం పట్టణంలో భూములను కేటాయించారు. అయినా అవి అమలులోకి రాలేదు. పైగా జిల్లాలో గుర్తించిన మునిసిపాలిటీల నుంచి చెత్తను గూడెం తరలించి, దాని నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్న ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ఏటా మున్సిపాలిటీ పారిశుద్ధ్య నిర్వహణకు రూ.80 లక్షలు ఖర్చు చేస్తోంది.

యార్డులు ఉన్నా యాతన
పాలకొల్లు సెంట్రల్‌: మునిసిపల్‌ పరిధిలో 31 వార్డులకుగాను సుమారు 80 వేల మంది జనాభా ఉన్నారు. రోజుకు 30 టన్నుల చెత్త డంపింగ్‌యార్డుకు చేరుతోంది. ఇక్కడ డంపింగ్‌యార్డులు స్థానిక యడ్లబజారు సెంటర్, రామయ్య హాలు ఏరియాల్లో ఉన్నాయి. రెండు డంపింగ్‌యార్డులు చెత్తతో కొండలా పేరుకుపోయాయి. ఈ చెత్తను ప్రక్షాళణ చేయడంలో అధికారులు చేతులెత్తేస్తున్నారు. చెత్తను సేకరించడానికి మునిసిపాలిటీకి 6 ట్రాక్టర్లు, 4 ఆటోలు ఉన్నాయి. పారిశుద్ధ్య పర్మినెంటు కార్మికులు 92, కాంట్రాక్ట్‌ కార్మికులు 77 మంది.. మొత్తం 169 మంది కార్మికులు పనిచేస్తున్నారు. జనాభా పెరుగుతున్నారు తప్ప కార్మికులు మాత్రం పెరగడంలేదు.

ఇంకా వేరుకాని చెత్త
జంగారెడ్డిగూడెం: నగర పంచాయతీ పరిధిలో రోజూ సుమారు 10 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఊరి వెలుపల ఉన్న డంపింగ్‌యార్డుకు దీనిని తరలిస్తున్నారు. అయితే తడిపొడి
చెత్తలను ఇంకా వేరుచేయడం లేదు. పట్టణంలో 20 వార్డుల్లో చెత్తను సేకరించేందుకు మొత్తం 89 కార్మికులు ఉండగా వీరిలో 83 మంది ఔట్‌ సోర్సింగ్‌పై పనిచేస్తున్నారు. చెత్తను తరలించేందుకు 3 ట్రాక్టర్‌లు, ఒక ఆటో, 46 రిక్షాలు ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణకు నెలకు రూ.13 లక్షలు.. ఏటా రూ.కోటిన్నర వరకూ వ్యయం అవుతోంది. పట్టణంలో ఈ నెల 31 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

స్థలం దొరక్క ఇక్కట్లు
నరసాపురం: నరసాపురంలో డంపింగ్‌యార్డ్‌ సమస్య దశాబ్దాలుగా ఉంది. 1956లో మునిసిపాలిటీ ఏర్పడింది. అప్పటి నుంచి డంపింగ్‌యార్డ్‌ లేదు. దీంతో నిబంధనలకు విరుద్దంగా గోదావరిగట్టునే చెత్తను డంప్‌ చేస్తున్నారు. డంపింగ్‌యార్డు స్థల సేకరణకు మునిసిపాలిటీ వద్ద నిధులు రూ.1.50 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. రెవిన్యూ శాఖ స్థలం అన్వేషిస్తోంది. 11.275 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 31 వార్డులతో విస్తరించి ఉన్న పట్టణంలో 60 వేల జనాభా ఉంది. పట్టణంలో రోజూ 32 టన్నుల చెత్తసేకరణ జరుగుతోంది. ఇందులో 10 టన్నులు తడి చెత్త, 22 టన్నులు చెత్త లభ్యమవుతోంది.    ప్రస్తుతం మునిసిపాలిటీలో శానిటరీ సెక్షన్‌లో 73 మంది శాశ్వత సిబ్బంది, మరో 91 మంది కాంట్రాక్ట్‌ వర్కర్లు పనిచేస్తున్నారు.

క్రైస్తవ శ్మశానవాటికలో డంపింగ్‌
కొవ్వూరు: డంపింగ్‌యార్డు కోసం ఆరేళ్ల  క్రితం నందమూరు శివారున సేకరించిన 1.96 ఎకరాల భూమి  హైకోర్టు తీర్పుతో దక్కలేదు. పట్టణంలో రోజుకు సరాసరి 26 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. రాజీవ్‌ కాలనీలో ఉన్న ఎకరం స్థలాన్ని ప్రస్తుతం చెత్త డంపింగ్‌కు వినియోగిస్తున్నారు. ఆ స్థలం సరిపోవడం లేదు. దీంతో రహదారుల చెంతన, క్రిస్ట్రియన్‌ శ్మశాన వాటికలోను పారబోస్తున్నారు. ఏటా పారిశుద్ధ్య నిర్వహణకు సుమారు రూ.కోటి ఖర్చు చేస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే కేంద్రం రాజమహేంద్రవరంలో  ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొవ్వూరులో సేకరించే చెత్తను ఈ కేంద్రానికి తరలించాలని నిర్ణయించారు. ఈ ప్లాంటు ప్రారంభం కాకపోవడంతో సమస్యగా ఉంది.

Advertisement
Advertisement