ముహూర్తమే తరువాయి !

State Cabinet Green Signal For Bandaru Port - Sakshi

బందరు పోర్టు నిర్మాణ పనులకు కేబినెట్‌ ఆమోదం

రూ.10,900 కోట్ల అంచనాలతో ఆరు దశల్లో నిర్మాణం

స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌

జనవరిలో పునాది పడే అవకాశం

జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన బందరు పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు కెనరా బ్యాంక్‌ ముందుకు రాగా.. తాజాగా రూ.10,900 కోట్ల అంచనాతో ఆరు దశల్లో పోర్టు నిర్మాణం పూర్తి చేసేందుకు శుక్రవారం రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కీలకమైన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కొత్త సంవత్సర ఆరంభంలోనే పోర్టు నిర్మాణ పనులకు పునాది రాయి పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.

సాక్షి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బందరు పోర్టు నిర్మాణ పనులకు పునాది రాయి వేసేందుకు సమయం సమీపించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టయిన బందరు పోర్టును 5,324 ఎకరాల్లో నిర్మించాలని తొలుత ప్రతిపాదించారు. అప్పట్లోనే శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆయన హఠాన్మరణం తర్వాత ఈ ప్రాజెక్టు అటకెక్కింది. వైఎస్సార్‌ హయాంలో ఈ పోర్టు నిర్మాణానికి 5వేల ఎకరాలు ఎందుకని నానాయాగీ చేసిన చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బందరు, పెడన మండలాల్లోని 21 గ్రామాల పరిధిలో ఏకంగా 33 వేల ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. పోర్టు  నిర్మాణం పేరిట నోటిఫై చేసిన 2,278.32 ఎకరాలు, పారిశ్రామికీకరణ పేరిట నోటిఫై చేసిన 12,144.86 ఎకరాలను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం డీ నోటిఫై చేసింది. కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1,730.22 ఎకరాల ప్రభుత్వ భూములు, 305.62 ఎకరాల ఎసైన్డ్‌ భూముల్లో పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించారు. మరో 900 ఎకరాల్లో కాంకర్‌ ఐఎల్‌ఎంజెడ్, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అండ్‌ రోడ్‌ కమ్‌ రైల్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. 

పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం..
పోర్టు నిర్మాణం పూర్తయితే కనీసం రూ. 5,500 కోట్ల నుంచి రూ. 9వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. కనీసం 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఏడాదికి కనీసం 18–20 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండ్లింగ్‌ జరుగుతుందని, తద్వారా రూ.200కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. పోర్టు నిర్మాణానికి రూ.4వేల కోట్ల వరకు సమకూర్చేందుకు ఇటీవలే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషి ఫలితంగా కెనరా బ్యాంక్‌ ముందు కొచ్చిన విషయం తెలిసిందే. తొలిదశ పనులకు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉండవు. ఈ నిధులతో బెర్త్‌ల నిర్మాణం, రోడ్‌ కమ్‌ రైల్‌ కనెక్టవిటీ, అప్రోచ్‌ రోడ్స్, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించే అవకాశం ఉంది. పోర్టు నిర్మాణంపై డీపీఆర్‌ తయారు చేసే బాధ్యతను కేంద్ర సంస్థయిన రైల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌కు (రైట్స్‌) అప్పగించిన విషయం తెలిసిందే. డీపీఆర్‌ జనవరి నెలాఖరు కల్లా ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top