పాలిథిన్‌ ప్రళయం ముంచుకొస్తుంది | Special Story About How Plastic Becoming Dangerous To Environment | Sakshi
Sakshi News home page

పాలిథిన్‌ ప్రళయం ముంచుకొస్తుంది

Published Sun, Jul 14 2019 6:49 AM | Last Updated on Sun, Jul 14 2019 10:22 AM

Special Story About How Plastic Becoming Dangerous To Environment - Sakshi

సాక్షి,విజయనగరం : మీకు తెలియకుండానే పర్యావరణానికి ఎంత చేటు చేస్తున్నారో తెలుసుకోవాలని ఉందా.. సరకుల కోసమో లేదా ఇంటి నుంచి బయటికెళ్లి తిరిగొచ్చినప్పుడు ఓసారి మీ చేతిలో ఎన్ని పాలిథిన్‌ సంచులు ఉన్నాయో లెక్కించండి. చాలామంది ఒట్టి చేతులతో వెళ్తారు. వచ్చేటప్పుడు పర్యావరణ పాలిట శాపంగా మారిన ప్లాస్టిక్‌ కవర్లను తీసుకొస్తున్నారు.

రోజూ ఒక్క విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే లక్షల్లో ప్లాస్టిక్‌ కవర్లు మున్సిపల్‌ వ్యర్థాల్లో కలుస్తున్నాయి. అందుకే.. ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కార్పొరేషన్‌ నిర్ణయించింది. వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు.. మరో వారం పాటు దాడులు నిర్వహించనుంది. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలకు పరిచయం చేసేందుకు కార్యాచరణ రూపొందించింది.

ఎన్నో ఏళ్లుగా విజయనగరాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్‌ భూతాన్ని నియంత్రించేందుకు కార్పొరేషన్‌ నడుం బిగించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 మైక్రాన్ల కన్న తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై నిషేధం విధించాలని నిర్ణయించింది. నిషేధిత ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించటంతో, వాటిని విక్రయించే దుకాణాలపై దాడులు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది.

కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ ఆదేశాల మేరకు కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ, ప్రజారోగ్య విభాగం అధికారి డాక్టర్‌ ప్రణీతలు ఈ మేరకు చర్యలు ప్రారంభించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా నార, గుడ్డ, పేపర్‌తో చేసిన పర్యావరణ హిత ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేశారు.

జూలై 3న ప్లాస్టిక్‌ ఫ్రీ డే పాటిస్తున్నా..
పునర్వినియోగానికి (సింగిల్‌ యూసేజ్‌) పనికి రాని ప్లాస్టిక్‌ వ్యర్థాల వినియోగం పెరుగుతోంది. నేలలో కరిగిపోయేందుకు కనీసం 500 ఏళ్లు పట్టే పాలిథి¯Œ  సంచుల వినియోగం భారీగా పెరిగింది. ఇలాంటి తరుణంలోనే ప్రజల్లో అవగాహన కల్పించి వినియోగాన్ని తగ్గించేందుకు స్వచ్ఛంద సంస్థలు కొన్నేళ్ల కిందట జూలై 3న ‘ఇంటర్నేషనల్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ ఫ్రీ డే’కు శ్రీకారం చుట్టాయి. విదేశాల్లో ఈ కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. 

ఎందుకు వాడొద్దంటే.. 

 • ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో పాలిథిన్‌ కవర్లు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తాయి. 
 • మట్టిలో కలిసి పోయేందుకు ఏళ్లకు ఏళ్లు పడుతుంది. 
 • నీరు భూమిలో ఇంకకుండా అడ్డు పడతాయి. 
 • పాలిథిన్‌ కణాలు భూసారం పీల్చేస్తాయి. 
 • కొన్నేళ్ల తర్వాత ప్లాస్టిక్‌ ధూళి ఏర్పడుతుంది. 
 • ఆ ధూళి ఒంట్లోకి వెళ్లి క్యాన్సర్, మూత్రపిండ, శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుంది. 
 • నగరంలో కర్రీ పాయింట్లు అధికంగా విస్తరిస్తుండగా వారంతా నిషేధిత ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్లోనే వేడి వేడి ఆహార పదార్థాలను ప్యాక్‌ చేస్తున్నారు. అలాంటి ఆహారం తీసుకుంటే ప్రమాదకరం. కవర్‌ తయారీలో ఉపయోగించే పోలి ఇథలీన్‌ లేయర్‌ వేడికి కరిగిపోతుంది. అలా కలుషితమైన ఆహారం తీసుకుంటే క్యాన్సర్‌ కారకంగా మారుతోంది. ఈ నేపధ్యంలో సిల్వర్‌ కాయిల్‌తో తయారు చేసిన ఉత్పత్తుల్లో ప్యాకింగ్‌పై మొగ్గు చూపాలి. 
 • మహిళల్లో అ«ధికంగా వచ్చే బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు ఇదే కారణం. 
 • చికెన్, మటన్‌ దుకాణాల్లో వినియోగించే నలుపు, ఎరుపు, పింక్‌ రంగుల్లో ఉండే ప్లాస్టిక్‌ కవర్లు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. వాటిలో తెచ్చే ఆహారం వేగంగా కలుషితమయ్యే అవకాశాలు ఉండటంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపి చిన్న పిల్లల్లో వేగంగా మందబుద్ధి వ్యాపిస్తుంది. 
 • విచ్చలవిడిగా వాడి పడేస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఆవులు, పశువులు, పందులు తిని మృత్యువాత పడుతున్నాయి.
 • శుభ కార్యక్రమాలు, పెళ్లిళ్లలో హెచ్చు సంఖ్యలో ప్లాస్టిక్‌ వినియోగం ప్రమాదకరంగా పరిణమించింది. ఈ నేపధ్యంలో పాత పద్ధతులను పాటించాల్సిన తరుణం మళ్లీ ఆసన్నమైంది.
 • ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా గుడ్డ సంచులు, నార సంచులు, పేపర్‌ బ్యాగ్‌లను  ఉపయోగించాలి. 

50 మైక్రాన్ల కంటే తక్కువుంటే నిషేధం
50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్‌ కవర్లతో ప్రమాదం అంతా ఇంతా కాదు. పునర్వినియోగానికి పనికి రావు. ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవచ్చు. జిల్లా కేంద్రంలో వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ కవర్లలో 50 శాతం నుంచి 70 శాతం ఇవే. వీటి వినియోగాన్ని కార్పొరేషన్‌ నిషేధించినా.. అడ్డుకట్ట పడలేదు. తక్కువ ధరకు వస్తుండటంతో పండ్లు, కూరగాయలు, కిరాణా స్టోర్‌ సామాన్లను ప్యాక్‌ చేసేందుకు వినియోగిస్తున్నారు. మంటల్లో కాలిపోయి ప్రమాదకర రసాయనాలు గాల్లోకి వెలువడుతున్నాయి.

ఈ నేపధ్యంలో 50 మైక్రాన్ల మందం కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ ఉత్పత్తులను నిషేధిస్తున్నట్టు కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ ప్రకటించారు. యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ ఉత్పత్తులను విక్రయిస్తే రోజుకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేయనున్నారు. దీనిపై ఈనెల 15 నుంచి 22 వరకు వ్యాపారులకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించిన అనంతరం 23వ తేదీ నుంచి ఆకస్మిక దాడులు నిర్వహించనున్నారు. ఇలా వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు, తర్వాతి వారం రోజులు దాడులు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. 

కాలువల్లో 40 శాతం.. 
కాలువల్లో 40 శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నట్టు కార్పొరేషన్‌ అధికారులే చెబుతున్నారు. కాలువల్లో నుంచి క్వింటాల్‌ వ్యర్థాలను పరిశీలించగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెక్క ముక్కలు, భవన నిర్మాణ వ్యర్థాలు కనిపించాయి. ఇందులో 20 శాతం నీరు.. 40 శాతం పూడిక మన్ను.. 40 శాతం తేలియాడే ప్లాస్టిక్‌ వ్యర్థాలున్నట్టు గుర్తించారు. ఇటీవల కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ప్రత్యేక శ్రద్ధతో పెద్ద చెరువు శుద్ధి సేవ కార్యక్రమం తలపెట్టిన సందర్భంలో 150 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను వెలికి తీశారు. ఇవే కాకుండా రోజూ కార్పొరేషన్‌ నుంచి సేకరిస్తున్న చెత్తను తరలించే గుణుపూరుపేట డంపింగ్‌ యార్డు వద్ద 4 లక్షల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయంటే అతిశయోక్తి కాదు. 

జిల్లా కేంద్రంలో 48 దుకాణాల గుర్తింపు

 • నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువుల నియంత్రణలో భాగంగా విజయనగరం కార్పొరేషన్‌ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నగరంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తులను విక్రయిస్తున్న 48 దుకాణాలను గుర్తించి యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. 
 • మూడు నెలల కాలంలో 50 మైక్రాన్ల మందం కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగంపై దాడులు చేయగా.. 292 కేజీల సరుకు సీజ్‌ చేశారు. రూ.2.66 లక్షల మొత్తాన్ని అపరాధ రుసుం కింద మున్సిపల్‌ ఖజానాకు జమ చేశారు. 
 • ఇప్పటికే లైసెన్స్‌ పొందిన వారితో పాటు కొత్త వారు 50 మైక్రాన్ల కన్న ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రతి నెల రూ.4వేలు మున్సిపల్‌ ఖజానాకు జమ చేయాలని నిర్ణయించారు. 
 • విక్రయించే ఉత్పత్తులపై తప్పనిసరిగా సంస్థ పేరు, బార్‌కోడ్, చిరునామా ముద్రించి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. చిన్న చిన్న దుకాణాల్లో వీటి విక్రయాలు పూర్తిగా నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ఏం చేయాలంటే.. 
ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని తగ్గించేందుకు ఎవరికీ వారే స్వచ్ఛందంగా అడుగు ముందుకేయాలి. బయటికి వెళ్లేటప్పుడు చేతి సంచిని తప్పకుండా తీసుకెళ్లాలి. చికెన్, మటన్, చేపలు తదితరాల కోసం వెళ్లినప్పుడు టిఫిన్‌ బాక్స్‌ను తీసుకెళ్లడం మరిచిపోవద్దు. చెత్తను ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేసి చెత్త కుండీల్లో వేయకూడదు. ఆహార పదార్థాలను వాటిలో పారేయకూడదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement