పోలీసుల ప్రమేయం లేదు | sp trivikrama varma interview | Sakshi
Sakshi News home page

పోలీసుల ప్రమేయం లేదు

Feb 23 2018 1:48 PM | Updated on Oct 9 2018 2:47 PM

sp trivikrama varma interview  - Sakshi

‘సాక్షి’ ముఖాముఖిలో ఎస్పీ త్రివిక్రమవర్మ

శ్రీకాకుళం , కాశీబుగ్గ: భావనపాడు పోర్టు నిర్మాణ విషయంలో పోలీసుల ప్రమేయం ఉండదని, లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు వస్తేనే పోలీసులు స్పందిస్తారని ఎస్పీ త్రివిక్రమవర్మ అన్నారు. భావనపాడు పోర్టు నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్‌ ఆధీనంలో ఉందని, నష్టపరిహారాన్ని మొదలుకొని పూర్తి చర్యలు వారే చేపడతారని తెలిపారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు గురువారం విచ్చేసిన ఆయనతో  ‘సాక్షి’ ముఖాముఖి.

సాక్షి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి?
ఎస్పీ: జిల్లాలో జాతీయ రహదారిపై ప్రతి కూడలి వద్ద బారికేడ్లు ఏర్పాటుచేశాం. కూడళ్లతో పాటు సబ్‌ రోడ్లకు సైతం బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు తగ్గించాం. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించగలిగాం.

సాక్షి: వాహనదారులపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు?
ఎస్పీ: ట్రాక్టర్, ఆటో, బస్సులు, పాఠశాల బస్సులు, బైక్‌లు ఇలా వాహనాలను బట్టి డ్రైవర్లకు అవగాహన సదస్సులు చేపడుతున్నాం. ఫిట్‌నెస్‌ లేని బస్సులు, కాలం చెల్లిన స్కూల్‌ బస్సులను నిలిపివేస్తున్నాం.

సాక్షి: ఉద్దాన ప్రాంతంలో ఉన్న పోలీసు స్టేషన్లలో సిబ్బంది కొరత ఉందా?
ఎస్పీ:బారువ, సొంపేట, వజ్రపుకొత్తూరు, కాశీబుగ్గ పరిధిలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. కొత్తవారు వస్తున్నారు తప్ప పాతవారు వేరేచోటకు మొగ్గుచూపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం మినహాయిస్తే ఉద్దాన ప్రాంతంలో పనిచేయడానికి ముఖం చాటేస్తున్నారు.

సాక్షి: జిల్లాలో క్రైం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది?
ఎస్పీ:కాశీబుగ్గ–పలాస ప్రాంతం. అనంతరం టెక్కలి, నందిగాం ఉన్నాయి

సాక్షి: కాశీబుగ్గ పరిధిలో క్రైం రేటు తగ్గించేందుకు ఏ చర్యలు చేపడుతున్నారు?
ఎస్పీ:కాశీబుగ్గ పరిధిలో స్టాఫ్‌ తక్కువగా ఉన్నారు. 53 మంది పురుషులు అవసరం ఉండగా 29 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయినప్పటికీ ప్రత్యేక చర్యలు ద్వారా ఇక్కడ శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం.

సాక్షి: జిల్లాలో హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. నివారణ చర్యలు చేపడుతున్నారా?
ఎస్పీ: గత ఏడాది కాలంలో 9 హత్యలు జరిగాయి. ఇందులో కొర్లాం సమీపంలో తన్మయిపండా అనే యువతి హత్య కేసు ఛేదించాం. హత్యలు అదుపునకు మరిన్ని చర్యలు చేపడుతున్నాం.

సాక్షి: నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు అధికంగా నమోదయ్యాయని తెలిసింది. వీటిపై మీ చర్యలేమిటి?
ఎస్పీ: జిల్లాలో 2012 ముందు నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు 306 ఉండేవి. హైకోర్టు దృష్టిపెట్టడంతో 170కు చేరుకున్నాయి. వీటిని మరింత తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం.

సాక్షి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వీటిపై ఏ చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్పీ:జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు అధికంగా నమోదవుతున్న మాట వాస్తమే. మొత్తం 304 కేసులు నమోదు కాగా, పరిష్కారానికి ప్రాముఖ్యం ఇస్తున్నాం.

సాక్షి: జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎలా ఉంది?
ఎస్పీ:మావోల ప్రభావం బాగా తగ్గింది. అయినా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఉంచాం.

సాక్షి: ఎల్‌హెచ్‌ఎంఎస్‌(లాకుడ్‌ హౌస్‌ మానటరింగ్‌ సిస్టం) యాప్‌ ఫెయిలైందా... ఎందుకు వాడటంలేదు?
ఎస్పీ:ఈ యాప్‌ ప్రజలలోకి ఇంకా చేరాల్సి ఉంది. ఇంటర్నెట్‌పై అవగాహన ఉన్నవారు వాడుతున్నారు. ఇంతవరకు 8వేల మంది యాప్‌లో నమోదయ్యారు. అంతా ఉచిత సర్వీసులు అందజేస్తున్నాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement