
చెన్నైకి పాముల స్మగ్లింగ్ !
పలమనేరు నుంచి చెన్నైకి పూడు పాములు, కొండ చిలువల స్మగ్లింగ్ గుట్టుచప్పుడు కా కుండా సాగుతోంది.
పలమనేరు, న్యూస్‌లైన్ : పలమనేరు నుంచి చెన్నైకి పూడు పాములు, కొండ చిలువల స్మగ్లింగ్ గుట్టుచప్పుడు కా కుండా సాగుతోంది. స్మగ్లర్లు టమాట మార్కెట్ నుంచి టమాటను, మామిడి కాయలను తీసుకువెళ్తున్న వాహనాల్లో రహస్యంగా పాములను తరలిస్తున్నట్టు స్పష్టమవుతోంది. మంగ ళవారం ఉదయం ఈ మార్కెట్‌లో ఓ గోనెసంచిలో పెద్ద కొండచిలువ పాము రైతుల కంటపడడమే ఇందుకు నిదర్శనమవుతోంది. పూడు పాములకు, కొండచిలువలకు చైనా, సింగపూరుల్లో డిమాండ్ ఉండడంతో స్థానికులు కొందరు ఇక్కడి కౌండిన్య అడవుల్లో పాములను పట్టి స్మగ్లింగ్ చేస్తున్నట్టు అవగతమవుతోంది.
పదిహేను అడుగుల పొడవున్న కొండచిలువ పామును గుర్తు తెలియని వ్యక్తులు ఓ గోనెసంచిలో వేసి పలమనేరు టమాట మార్కెట్ యార్డులోని మామిడికాయల మండీల సమీపంలో టమాట బస్తాల వద్ద ఉంచారు. యథావిధిగా ఇక్కడి నుంచి చెన్నైకి టమాట తీసుకెళ్లే లారీల్లో ఈ సంచి కూడా వెళ్లాల్సి ఉంది. అయితే మంగళవారం ఉదయం మార్కెట్‌కొచ్చిన రైతులు సంచి కదులుతుండడాన్ని గుర్తించారు. ఆ సంచిని తెరి చారు. భారీ కొండచిలువ బయటకొచ్చింది. అక్కడున్న వారంతా పరుగులు తీశారు.
ఈ విషయాన్ని వారు అటవీశాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ పామును పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. కొండచిలువఅక్కడికి ఎలా వచ్చిందనే విషయాన్ని సైతం పట్టించుకోకుండా వారు వెళ్లిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొండచిలువ సంచిలో ఎందుకుందో ?
మార్కెట్ యూర్డులో గోనె సంచిలో కొండచిలువ ఎందుకుంది ? ఎవరు తీసుకొచ్చారు ?... అనే విషయాలను అటవీశాఖాధికారులు పట్టించుకోలేదు. పాము దొరికింది అడవిలో విడిచిపెట్టామన్నట్టే వ్యవహరించారు. గతంలో ఈ ప్రాంతంలో పూడుపాములు స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణకు సంబంధించి అటవీశాఖ అధికారులు ముగ్గురు ఏజెంట్లను పట్టుకున్నారు. అప్పట్లోనే చెన్నైకి చెందిన ఓ ముఠా ఈ ప్రాంతంలో ఏజెంట్లను ఏర్పరచుకుని పాములను కొనుగోలు చేస్తున్నట్లు కూడా గుర్తించారు.
పాములను స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ మీడియూ ద్వారా చెప్పి మిన్నకుండిపోయారు. పాముల స్మగ్లింగ్ వెనుక ఉన్న స్థానిక ఏజెంట్లెవరు ? స్మగ్లర్ల నెట్‌వర్క్ ఏంటి ? అనే విషయాలపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. గోనెసంచిలో కొండచిలువ విషయమై స్థానిక ఎఫ్‌ఆర్వో బాలవీరయ్యను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఆ పాము రైతుల టమాటాలతో పాటు మార్కెట్‌లోకి వచ్చేసిందని, దాన్ని సురక్షితంగా అడవిలోకి వదిలిపెట్టామని తెలిపారు. అయితే స్మగ్లింగ్ గురించి తమకేమీ తెలియదని చెప్పారు.