ఘల్లుమంది గ్లాసు..

Significantly increased alcohol sales in the state - Sakshi

రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన మద్యం అమ్మకాలు

గతేడాది కంటే ఈ ఏడాది రూ.258 కోట్ల అధికంగా విక్రయాలు

అత్యధికం చిత్తూరు జిల్లా.. అత్యల్పం వైఎస్సార్‌ జిల్లా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంతో అమ్మకాల వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. గతేడాది జనవరిలో రాష్ట్రంలో రూ.1,306 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది జనవరిలో రూ.1,690 కోట్లు విక్రయాలు జరిగాయి. అంటే.. 29.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత ఫిబ్రవరిలో రూ.522 కోట్ల మద్యం విక్రయించగా, ఈ నెల 15 నాటికే అమ్మకాల విలువ రూ.780 కోట్లకు చేరింది.

ఫిబ్రవరిలో 15 రోజులకే రూ.258 కోట్ల అధికంగా అమ్మకాలు జరిగాయి. 15 రోజులకే గతేడాది ఫిబ్రవరి కంటే 49.22 శాతం వృద్ధి రేటు నమోదు కావడంపై ఎక్సైజ్‌ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ ఫిబ్రవరిలో మద్యం విక్రయాలను పరిశీలిస్తే.. అమ్మకాల్లో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, వైఎస్సార్‌ జిల్లా చివరి స్థానంలో ఉంది. చిత్తూరు జిల్లాలో రూ.79 కోట్లు, వైఎస్సార్‌ జిల్లాలో రూ.19.58 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది అమ్మకాలపై మొత్తం రూ.15,133 కోట్లకు పైగా ఆర్జించగా, ఈ ఏడాది రూ.17 వేల కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని విధించడం గమనార్హం. 2014లో రూ.11,569 కోట్లుగా ఉన్న అమ్మకాల విలువ ఇప్పటివరకు సుమారు రూ.4 వేల కోట్ల వరకు పెరగడం గమనార్హం.  

ఈవెంట్ల పేరిట విచ్చలవిడిగా అమ్మకాలు
మద్యం అమ్మకాల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈవెంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలకు అనుమతిలిచ్చింది. కొత్త ఏడాది ప్రారంభం రోజు పార్టీల కోసం ఇష్టమొచ్చినట్లు ఈవెంట్ల పర్మిషన్లు, పగలూ, రాత్రి తేడా లేకుండా అమ్మకాలకు అనుమతులివ్వడంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల మహాశివరాత్రి పర్వదినాన కూడా ఈవెంట్ల పేరుతో ఎక్సైజ్‌ శాఖ అనుమతులు జారీ చేసింది. 

అమ్మకాలు పెరగడానికి కారణాలివే..
- డిస్టిలరీల నుంచి మద్యం నిల్వకు 13 జిల్లాల్లో మద్యం డిపోల సంఖ్య పెరిగింది. డిపోలను పెంచి సరుకు సరఫరాకు అందుబాటులో ఉంచారు.  
గతేడాది రూ.15 వేల కోట్ల మద్యం ఆదాయం కోసంరాష్ట్ర ప్రభుత్వం 15 వేల కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా (ఎండీఆర్‌లుగా) మార్చేసింది.
చీప్‌ లిక్కర్‌ను ఏరులై పారించేందుకు ఏకంగా టెట్రా ప్యాకెట్లలో సరఫరా చేసింది. 
మద్యం వ్యాపారులకు కమీషన్లను 7 శాతం నుంచి 15 శాతానికి పెంచే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
బెల్టు షాపుల సంఖ్య గతంలో కంటే అధికంగా పెరిగాయి. ఫోన్‌ చేస్తే ఇంటికే మద్యం వచ్చేలా సిండికేట్లు ఏర్పాట్లు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top