అమాత్యుని..అభివృద్ధి చూతము రారండి!

Sidda Raghava Rao Not Development The Darsi Constituency - Sakshi

మంత్రి శిద్దా నియోజకవర్గంలో అభివృద్ధి పూజ్యం

బసిరెడ్డిపల్లిలో నాసిరకంగా వీధి కాలువల నిర్మాణాలు 

మురుగు మొత్తం ఎక్కడికక్కడ కాలువల్లోనే..

 చిన్న వర్షానికే చెరువులు తలపిస్తున్న రోడ్లు 

దర్శి: జిల్లాకు చెందిన ఏకైక మంత్రి శిద్దా రాఘవరావు తన నియోజకవర్గం దర్శిలో అభివృద్ధి చేశామని శిలాఫలకాలు వేసుకోవడం తప్ప ఎక్కడా ఆ జాడ కనిపించడం లేదు. వీధికో శిలాఫలకం వేయడం లక్షలాది రూపాలయలు నిధులు కేటాయించడం.. తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టర్‌ల అవతారం ఎత్తి తిలా పాపం తలా పిడికెడు అన్న సామెతగా అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై దోచుకున్నారనేందుకు బసిరెడ్డిపల్లె గ్రామమే ఒక ఉదాహరణ. బసిరెడ్డిపల్లెలో గురువారం రాత్రి చిన్నపాటి వర్షం కురిసింది. చిన్న వర్షానికి గతంలో వేసిన సిమెంట్‌ రోడ్లలో నీరు అలాగే నిలబడిపోయింది. మంత్రి శిద్దా రాఘవరావు అధికారంలోకి వచ్చిన తర్వాత వీధి కాలువలు నిర్మించారు.

నిర్మాణాలు లోపభూయిష్టంగా ఉండటంతో కాలువల్లో మురుగు బయటకు వెళ్లే అవకాశమే లేదు. ఇదీ మంత్రి శిద్దా రాఘవరావు అభివృద్ధి పేరుతో ప్రజాధనం ఖర్చు చేసి.. చేస్తున్న అభివృద్ధి తీరు. ప్రజాధనం దుర్వినియోగం చేయడమేగాక గతంలో వేసిన సిమెంట్‌ రోడ్లు కూడా బుదరమయం చేయడం టీడీపీ ప్రభుత్వానికే చెల్లిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలో వీధి కాలువలు రోడ్డుకంటే ఎత్తులో నిర్మించారు. వీధి కాలువల్లో నీరు బయటకు వెళ్లే వీల్లేకుండా గ్రామంలోకి పల్లం..గ్రామం బయటకు మెరక పెట్టి నిర్మించారు. దీంతో రోడ్డుపై పడిన వాననీరు కూడా వీధి కాలువల్లోకి వెళ్లే అవకాశమే లేకుండాపోయింది.

 చిన్న వర్షం కురిసినా నీరు రోడ్డుపైనే

చిన్నపాటి వర్షం కురినినా నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. దీనికి తోడు గ్రామంలో వీధి కాలువలు నిర్మాణాలు జరిగిన సమయంలో నివాసాల ముందు పెద్ద పెద్ద గుంతలు చేసి పూడ్చకుండా వెళ్లిపోయారని గ్రామస్తులు వాపోయారు. దీంతో ఒక్కో ఇంటికి రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేసి మెరకలు పోసుకుని కాలువలపై బండలు వేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు చేస్తున్న సమయంలో రోడ్డు కంటే కాలువలు ఎత్తు పెడుతున్నారని, గ్రామంలోకి పల్లం..ఊరి చివర మెరక పెట్టి కాలువలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాలువల్లో నీరు బయటకు వెళ్లక ఎక్కడి మురుగు అక్కడే ఆగిపోతోందని వాపోతున్నారు.

దోమలు ప్రబలి విషజ్వరాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో టీడీపీ నాయకులు అభివృద్ధి చేందుతున్నారేగానీ గ్రామానికి మాత్రం అభివృద్ధి చేయక పోగా సమస్యలు తెచ్చి పెట్టారని గ్రామస్తులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గ్రామంలో అన్నీ వీధుల్లో సిమెంట్‌ రోడ్లు వేయించారు. వీధి కాలువలు నిర్మించే సమయానికి ఎన్నికలు వచ్చాయి. మళ్లీ కాలువుల నిర్మాణాలు చేపట్టి గ్రామంలో మురుగు బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top