
`పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి`
గ్యాస్ ధరను ప్రభుత్వం అమాంతంగా పెంచడం దారుణమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: గ్యాస్ ధరను ప్రభుత్వం అమాంతంగా పెంచడం దారుణమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కొత్త సంవత్సరం మొదటిరోజే సామాన్యుడి నడ్డివిరిచిందని ఉమ్మారెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పడూ ఏరోజూ గ్యాస్ ధరలు పెరగలేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తుచేశారు. కాగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని విచారణ జరగకుండా కాలం వెల్లబుచ్చుతున్నారని ఉమ్మారెడ్డి ఆరోపించారు.
అవినీతి గురించి చంద్రబాబు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆయన హితవు పలికారు. టీడీపీ నేతలు చౌకబారు సవాళ్లు విసరడం సమన్యసం కాదని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న ప్రతీ నిర్ణయంపై టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉందంటూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సవాల్ విసిరారు.