అందరూ గురివిందలే! | severe neglect of tribal death | Sakshi
Sakshi News home page

అందరూ గురివిందలే!

Jul 4 2017 2:19 AM | Updated on Sep 5 2017 3:06 PM

తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం చాపరాయిలో సంభవించిన గిరిజనుల మరణాలపై ఎవరికి వారు తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

- గిరిజనుల మరణాలపై తీవ్ర నిర్లక్ష్యం
- ఎవరికి వారు తప్పుకునే యత్నం
 
గిరిజన సంక్షేమానికి 2015–16 బడ్జెట్‌లో రూ.90 కోట్లు కేటాయించగా రూ.62.87 కోట్లు ఖర్చు చేశారు. 2017–18 బడ్జెట్‌లో 94.57 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు రూ.19.95 కోట్లు ఖర్చు చేశారు. కానీ గిరిజన గ్రామాల్లో తాగు నీరు లేదు. రోడ్లూ లేవు. వైద్య సౌకర్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక విద్యా రంగం పరిస్థితి చెప్పనక్కర్లేదు. 
 
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం చాపరాయిలో సంభవించిన గిరిజనుల మరణాలపై ఎవరికి వారు తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో మా తప్పు లేదంటే మా తప్పు లేదని చెప్పుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం వంద శాతం ఉందని గిరిజనులు, విపక్షాలు వేలెత్తి చూపిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనందబాబు ఒక అడుగు ముందుకేసి ఇందులో అధికారుల తప్పేమీ లేదని తేల్చిచెప్పారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్యులను, సిబ్బందిని నియమించకుండా వైద్య, ఆరోగ్య శాఖ పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది. ఏటా ఖాళీలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సి ఉండగా అలాంటివి ఏమీ జరగడం లేదు. ముఖ్యంగా పారా మెడికల్‌ సిబ్బంది పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసి వారి ద్వారా గ్రామాల్లో నిరంతరం వైద్య సేవలు అందించాలి. మొత్తం 43 రకాల ఉద్యోగాల్లో 8,807 మంది పనిచేయాల్సి ఉండగా 7,884 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 923 ఖాళీలు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement