సీజన్‌కు ముందే సీడ్స్‌ | Seeds Supply to Farmers before the season | Sakshi
Sakshi News home page

సీజన్‌కు ముందే సీడ్స్‌

Jun 18 2020 4:00 AM | Updated on Jun 18 2020 4:07 AM

Seeds Supply to Farmers before the season - Sakshi

సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతల ఇంటి ముంగిటకే విత్తనాలు సరఫరా చేయాలన్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ప్రయోగం జయప్రదమైంది. గత నెల 18వతేదీన ప్రారంభించిన విత్తనాల పంపిణీ నెల తిరగకముందే పూర్తయింది. విత్తనాలను ఉత్పత్తి, శుద్ధి చేసి, రాష్ట్రంలోని రైతాంగానికి ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. గతానికి భిన్నంగా ఎక్కడా, ఎలాంటి వివాదాలు, సమస్యలు లేకుండా విత్తనాల పంపిణీ సజావుగా పూర్తి కావడం ఈ ఏడాది ప్రత్యేకతగా వ్యవసాయ రంగ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. నాణ్యమైన విత్తనాన్ని సరసమైన ధరకు రైతులకు సకాలంలో అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా విత్తనాల  పంపిణీ పూర్తి చేసినట్లు ఏపీ సీడ్స్‌ ఎండీ శేఖర్‌బాబు ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు.

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు రాక ముందే వేరుశనగ విత్తనాల పంపిణీ 95 శాతం పూర్తి కాగా బుధవారం నాటికి మొత్తం వంద శాతం పంపిణీ పూర్తైనట్లు తెలిపారు. వరి విత్తనాల పంపిణీ 95.35 శాతం, పచ్చిరొట్ట విత్తనాల సరఫరా 86.21 శాతం పూర్తి అయింది. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావడం వెనుక అధికారుల సమన్వయం ఒకఎత్తు కాగా రైతులు నూతన ఒరవడికి సంసిద్ధమై ప్రణాళికాబద్ధంగా మెలగడం మరో ఎత్తుగా పేర్కొంటున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అధికారులు ప్రణాళికాబద్ధంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ పూర్తి చేశారు. ఇదెలా సాధ్యమైందంటే...

రాయితీపై రైతులకు...
► మే 18వతేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వేరుశనగ సహా ఇతర విత్తనాల పంపిణీ చేపట్టారు. 4.30 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని 40 శాతం సబ్సిడీతో గ్రామ స్థాయిలోనే పంపిణీ చేశారు.
► 2.28 లక్షల క్వింటాళ్ల వరి విత్తనం (వడ్లు) పంపిణీ చేయాలని  నిర్దేశించగా ఇప్పటివరకు 1.47 లక్షల క్వింటాళ్లను కిలోకు రూ.10 రాయితీతో పంపిణీ చేశారు. ఇంకా కావాల్సిన వారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచారు. 
► 83 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయగా 36,144 క్వింటాళ్లకు రైతుల నుంచి ఆర్డర్లు వచ్చాయి. సుమారు 87 శాతం మందికి విత్తనాన్ని 50 శాతం రాయితీతో పంపిణీ చేశారు. 
► 20,288 క్వింటాళ్ళ అపరాల విత్తనాన్ని 30 శాతం రాయితీపై ఇచ్చేందుకు రైతు భరోసా కేంద్రాల వద్ద సిద్ధం చేశారు.
► 3,310 క్వింటాళ్ల చిరుధాన్యాల విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీకి ఆర్బీకేలలో అందుబాటులో ఉంచారు.

8.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం.. 
రైతన్నలకు అవసరమైన 8.39 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను శుద్ధి చేసి గ్రామస్థాయిలో పంపిణీకి సిద్ధం చేశారు. ఖరీఫ్‌కు ముందే రైతుల నుంచి ఇండెంట్లు స్వీకరించి ఎవరికి ఏ రకం విత్తనాలు కావాలో ఆర్డర్లు తీసుకుని తదను గుణంగా విత్తనాభివృద్ధి సంస్థ సేకరించి గ్రామాలకు పంపింది.

పంపిణీలో కొత్త ఒరవడి...
► గ్రామ స్థాయిలో విత్తనాల పంపిణీ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. సీజన్‌కు ముందే, తొలకరికి ముందే విత్తనాలు పంపిణీకి సిద్ధమయ్యాయి. 
► సన్న, చిన్నకారు రైతులు కొనుక్కు నేందుకు వీలుగా వివిధ పరిమాణా ల్లో ప్యాకింగ్‌ చేశారు. (ఉదాహరణకు 5, 10, 25 కిలోల ప్యాకెట్లలో జీలుగ, పిల్లిపెసర్లు, వడ్లు లాంటివి) 
► విత్తనాల రవాణాకు ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుని నిరాటంకంగా సరఫరా చేపట్టారు. రైతు భరోసా కేంద్రాలు, ఆన్‌లైన్‌లో విత్తనాన్ని బుకింగ్‌ చేసుకుని తీసుకునే సౌకర్యం కల్పించారు.

ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా పంపిణీ
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన విత్తనాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేశాం. నాణ్యతపై ఫిర్యాదులు పరిష్కరించాం. వర్షాలు రాక మునుపే విత్తనాలను రైతుల చేతిలో ఉంచాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. అందుకు అనుగుణంగా పంపిణీ పూర్తి చేశాం. రైతులకు ఇంకా ఎక్కడైనా విత్తనాలు కావాలన్నా ఇస్తాం. రైతు సేవలో ఏపీ సీడ్స్‌ ఎప్పుడూ ముందుకు సాగుతుంది. నాణ్యత, మొలక శాతంపై అనుమానాలు ఉంటే మా శాఖాధికారుల దృష్టికి తీసుకురావచ్చు. 
–శేఖర్‌ బాబు, ఏపీ సీడ్స్‌ ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement