అంకెల్లో ఘనం...అందని రుణం | Scale of finance to back-country farmers | Sakshi
Sakshi News home page

అంకెల్లో ఘనం...అందని రుణం

Aug 25 2015 11:57 PM | Updated on Oct 1 2018 2:00 PM

అంకెల్లో ఘనం...అందని రుణం - Sakshi

అంకెల్లో ఘనం...అందని రుణం

జిల్లాలో ఈ ఏడాది 2.65లక్షల ఎకరాల్లో వరిసాగవుతోంది. జూన్‌లోనే తొలకరి పలుకరించడంతో కాడెపట్టిన రైతన్నపై కొంతకాలం వరుణుడు ముఖం చాటేశాడు

♦ బ్యాంకర్ల శల్యసారథ్యం
♦ స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్‌కు నోచుకోని రైతులు
♦ అప్పుల కోసం తిప్పలు
 
 అంతా అంకెల గారడి..కాగితాల మీద అట్టహాసంగా రుణ ప్రణాళిక. రూ. వందలకోట్లు ఇచ్చినట్టు వివరాలు. బ్యాంకర్ల శల్యసారథ్యంతో అరక పట్టిన రైతుకు మాత్రం మిగులుతున్నది అప్పుల తిప్పలు. ప్రైవేటు వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు. ఇది జిల్లాలో అన్నదాతల దుస్థితి. ఎటువంటి అడంగల్ పత్రాలు లేకుండానే లక్ష వరకు పంట రుణం ఇవ్వాలని సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా రుణాల మంజూరులో బ్యాంకర్లు మోకాలొడ్డు తున్నాయి.
 
 సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఈ ఏడాది 2.65లక్షల ఎకరాల్లో వరిసాగవుతోంది. జూన్‌లోనే తొలకరి పలుకరించడంతో కాడెపట్టిన రైతన్నపై కొంతకాలం వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో కమ్ముకొచ్చిన కరవును చూసి కలతచెందాడు. పదిరోజులుగా అడపాదడపా వర్షాలతో వ్యవసాయపనులు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు 75శాతం విస్తీర్ణంలో నాట్లుపడ్డాయి. వచ్చేనెల మొదటివారానికల్లా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎకరాకు ఒక్కో రైతు రూ.10 వేలకు పైగా పెట్టుబడి పెట్టాడు. పంటచేతికొచ్చే సమయానికి మరో రూ. పదివేలవరకు అవసరమవుతుంది.

తొలకరి జల్లుపడిన మొదలు అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలుచేస్తూనే ఉన్నారు అన్నదాతలు. ఖరీఫ్‌లో రూ.840కోట్ల రుణాలు ఇవ్వాలని జిల్లా అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. గతంలో ఎన్నడూలేని రీతిలో కేవలం రెండు నెలల్లోనే ఏకంగా రూ.605 కోట్లరుణాలిచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో రెండున్నర లక్షలమంది రైతులుండగా ఇప్పటి వరకు లక్ష మందికి ఈ రుణాలందినట్టు తెలుస్తోంది.పైగా ఇటీవల స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ రూ.24వేలకు పెంచినందున ఆ మేరకు గతంతో ఖరీఫ్‌తో పోలిస్తే ప్రతీరైతుకు రూ.ఐదు వేలకు పైగా అదనంగా రుణం అందిందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు.

గణాంకాలు ఇలా ఉంటే వాస్తవపరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీ వర్తించిన రైతుల్లో 70 శాతం మందికి తొలి విడత జమైన 20శాతం మాఫీ సొమ్ము పోను మిగిలిన అప్పు వడ్డీతో కలిసి తడిసి మోపడైంది. ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల్లో 85శాతం రుణమాఫీ వర్తించిన రైతులకు మిగిలిన బకాయిల రెన్యువల్‌కే సరిపోయాయి. పూర్తిగా రుణమాఫీ అయిన  రైతులకు మాత్రమే కొత్త రుణాలు చేతికందాయి. కేవలం 15శాతం మాత్రమే కొత్త రైతులకు రుణాలందాయి. అంటే రుణాలు పొందిన లక్షమంది రైతుల్లో కేవలం 15వేల మందికి మాత్రమే ఫలితం దక్కింది. మిగిలిన వారిలో ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా చేతికంద లేదు.

కాగితాల మీద మాత్రం వారికి రుణమిచ్చినట్టుగా చూపిస్తున్నప్పటికీ చేతికి చిల్లిగవ్వ అందని పరిస్థితి.. దీంతో వీరంతా అప్పుల కోసం వడ్డీవ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలుచేయాల్సిన దుస్థితి.ఎటువంటి అడంగల్ పత్రాలు లేకుండానే లక్ష వరకు పంట రుణం ఇవ్వాలని సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా రుణాల మంజూరులో బ్యాంకర్లు మోకాలొడ్డు తున్నాయి. పైగా పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ తనఖా పెట్టుకునే కేవలం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు రూ.24వేలకు మించి రుణం ఇవ్వడం లేదు. బంగారు ఆభరణాలు కుదవపెట్టుకున్నా సరే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు మించి ఇవ్వడం లేదు.

దీంతో ఇతర ఖర్చుల కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఉదాహరణకు..తనకు మాఫీ కాగా రూ.55వేల వరకు అప్పు ఉందని..ప్రస్తుతం తనకున్న రెండెకరాలకు కొత్త రుణం కోసం దరఖాస్తు చేస్తే రూ.48వేలుమంజూరు చేశారని..ఆ మొత్తం రెన్యువల్‌కే సరిపోయిందని. చేతికి  రూపాయి రాలేదని చీడికాడకు చెందిన కొండబాబు అనే రైతు వాపోయాడు. తాను రూ.5ల వడ్డీకి 50వేలు అప్పు చేసి సాగు చేయాల్సి వస్తుందని వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement