రైతుబంధుకు బ్యాంకర్ల మోకాలడ్డు.. బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు

Accounts of farmers on hold for non renewal of crop loans - Sakshi

పంట రుణాలు రెన్యువల్‌ చేసుకోలేదని హోల్డ్‌లో రైతుల ఖాతాలు

రైతుబంధుతోపాటు ధాన్యం డబ్బులు డ్రా చేసుకోలేని దుస్థితి

ఖరీఫ్‌ సాగు ఖర్చులకు తిప్పలు పడుతున్న రైతులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వానాకాలానికి సంబంధించి రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఐదెకరాల లోపు ఉన్న వారంతా చిన్న, సన్నకారు రైతులే ఉంటారు.

ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని అందుకోకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. పంట రుణం బకాయిలున్నాయంటూ ఈ రైతుబంధు డబ్బులను డ్రా చేసుకోనివ్వడం లేదు. ఆయా రైతుల ఖాతాలను హోల్డ్‌లో పెడుతున్నారు. ఈ డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. 

ఒక్క శాఖలోనే 500 ఖాతాలు హోల్డ్‌
ఏపీజీవీబీ బ్యాంకుకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో 53 శాఖలు ఉన్నాయి. ఒక్క వట్‌పల్లి బ్రాంచ్‌లోనే సుమా రు 500 మంది రైతుల ఖాతాలను బ్యాంకర్లు హోల్డ్‌లో పెట్టారు. వీరి ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు, ధాన్యం డబ్బులను విత్‌డ్రా చేసుకోనివ్వడం లేదు. దీంతో రైతులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్లగా.. ఫీల్డ్‌ ఆఫీసర్‌ లేడని, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు.

సాగు ఖర్చుల కోసం..
ప్రస్తుతం వానాకాలం పంట సీజను ప్రారంభమైంది. ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్‌ కిరాయి ఇలా సాగు ఖర్చుల కోసం రైతులకు డబ్బులు అవసరం ఉంటుంది. వచ్చిన రైతుబంధు డబ్బులను బ్యాంకర్లు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ ఖర్చుల కోసం తాము ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు వాపోతున్నారు. అధిక వడ్డీకైనా అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, గత రబీ సీజనులో ధాన్యం విక్రయించిన రైతులకు ధాన్యం డబ్బులను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమచేసింది. పంట రుణం రెన్యువల్‌ చేసుకోలేదంటూ ఈ డబ్బులను కూడా డ్రా చేసుకోనివ్వడం లేదని రైతులు వాపోతున్నారు.

రెన్యువల్‌ చేసుకుంది 20 శాతం లోపే.. 
రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రుణాలను ప్రభుత్వం విడతల వారీగా మాఫీ చేస్తోంది. మాఫీ కాని చాలామంది రైతులు తమ పంట రుణా లను రెన్యువల్‌ చేసుకోలేదు. కొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వం ఎలాగైనా మాఫీ చేస్తుందని రెన్యు వల్‌ చేసుకోలేదు. రుణాలను రెన్యువల్‌ చేసుకున్న రైతు లు 20 శాతంలోపే ఉంటారని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో మిగిలిన 80 శాతం మంది రైతుల్లో చాలామందికి ఇలాంటి సమస్య ఎదురవుతోందని అంచనా.

బదిలీపై వచ్చిన మేనేజర్లకు తెలియక
కొన్ని బ్రాంచ్‌లకు మేనేజర్లు ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వస్తుంటారు. రైతుబంధు డబ్బులు ఆపొద్దని తెలియక వారు ఖాతాలను హోల్డ్‌లో పెడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. రైతుబంధు డబ్బులు ఆపొద్దని అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చాం. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. రుణమాఫీ అవుతుందనే కారణంగా చాలామంది పంట రుణాలను రెన్యువల్‌ చేసుకోవడం లేదు.  – గోపాల్‌రెడ్డి, లీడ్‌బ్యాంకు మేనేజర్, సంగారెడ్డి

ఈ రైతు పేరు నరేందర్‌గౌడ్‌. సంగారెడ్డి జిల్లా నాగులపల్లి గ్రామం. తన 2.62 ఎకరాలకు సంబంధించి రైతుబంధు కింద రూ.13,100 బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఖరీఫ్‌ పంట సాగు ఖర్చుల కోసం డబ్బులు తీసుకునేందుకు వట్‌పల్లిలోని ఏపీజీవీబీ బ్యాంకుకెళ్లాడు. అయితే, బ్యాంకు అధికారులు రూ.1.60 లక్షల పంట రుణ బకాయి ఉందని, ఈ రుణాన్ని రెన్యువల్‌ చేసుకోనందున ఖాతాను హోల్డ్‌లో పెట్టామని చెప్పారు. దీంతో రైతుబంధు డబ్బులు డ్రా చేసుకోలేక నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం తిరుమలపూర్‌ డీకే గ్రామానికి చెందిన అంబయ్యకు మూడెకరాల భూమి ఉంది. మండల కేంద్రంలోని యూనియన్‌ బ్యాంకులో రూ.80 వేల వరకు పంట రుణం ఉంది. ఇటీవల రైతుబంధు కింద ఖాతాలో జమ అయిన డబ్బులను పంట పెట్టుబడికి డ్రా చేసుకుందామంటే బ్యాంకర్లు అనుమతించడం లేదని అంబయ్య వాపోయాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top