హక్కులు కాపాడి ప్రాణాలు నిలపండి

Save life and rights - Sakshi

మానవ హక్కుల కమిషన్‌కు అప్పిరెడ్డి ఫిర్యాదు

గుంటూరు వెస్ట్‌: డయేరియాతో అమాయక ప్రజలు మరణిస్తున్నా చర్యలు తీసుకోవడం చేతగాని ప్రభుత్వం, అధికారులు ప్రజలపై, పార్టీలపై నిందలు మోపి వేసి చేతులు దులుపుకోవడం హేయమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. నగరంలో రెండు వారాలుగా డయేరియాతో మృత్యువాత పడుతున్న అమాయకుల తరఫున అప్పిరెడ్డి శనివారం జిల్లా కోర్డు ప్రాంగణంలోని మానవ హక్కుల చైర్మన్, మొదటి అడిషనల్‌ జిల్లా జడ్జి నంది కొండ నరసింగారావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఇప్పటికి 24 మంది చనిపోయారని, వేల మంది ఆసుపత్రిపాలై, అవయవాలు పనిచేయక నరకయాతన అనుభవిస్తున్నారని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం తప్పించుకునే దారులు వెదుకుతోందన్నారు. గుంటూరంటే కల్తీకి ప్రధాన కేంద్రమనే అపకీర్తి మూటగట్టుకున్నా అధికారుల్లో స్పందన కరువైందన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ప్రజలు మరణించాల్సిన పరిస్థితి నెలకొనడం విచారకరమని అప్పిరెడ్డి పేర్కొన్నారు.

మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు  వాటాల లెక్కల్లో బిజీగా ఉన్నారని,ప్రజల కష్టాలు వినే తీరిక లేవని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ ప్రజల తరఫున రాజీలేని పోరాటం చేస్తూ, వారికి  అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు న్యాయం చేసేందుకే మానవ హక్కుల చైర్మన్‌ను ఆశ్రయించామని తెలిపారు.న్యాయవాదులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, శిఖా బెనర్జీ, పోకల వెంకటేశ్వర్లు, శశి, కేశవ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top