విజయవంతంగా ముగిసిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ

విజయవంతంగా ముగిసిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ


హైదరాబాద్: ఏపి ఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఎల్బి స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావులేకుండా ఒక పక్క తెలంగాణ బంద్, మరో పక్క సమైక్యాంధ్ర బహిరంగ సభ ప్రశాంతంగా జరిగిపోయాయి.  పోలీసులకు టెన్షన్ తగ్గింది. బహిరంగ సభ మూడు గంటల 20 నిమిషాల సేపు సాగింది. ఉదయం 10 గంటల నుంచి స్టేడియం దగ్గర సందడి మొదలైంది.  సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి  వేల సంఖ్యలో  ఉద్యోగులు  తరలివచ్చారు. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా  సభను ముగించారు. ఇది అంతం కాదు ఆరంభమని ఏపి ఎన్జిఓ నేతలు  ప్రకటించారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకోవాలి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సికింద్రాబాద్‌లో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రైవేట్‌ ఉద్యోగులు కూడా సభకు హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే వారిని స్టేడియం లోపలకు అనుమతించలేదు. వారు బయటే ఉండి నిరసన తెలిపారు. సభ ముగిసేవరకు వారు బయటే ఉన్నారు. అనుకున్న సమయానికి సభను జనగణమనతో ముగించారు.ఎటువంటి గొడవలకు తావులేకుండా మంచి వాతావరణంలో తెలంగాణ బంద్, సమైక్యాంధ్ర సభ జరగడం మంచి పరిణామంగా భావించవచ్చు. రెండు ప్రాంతాలవారి కార్యక్రమాలపై గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top