సర్పంచులపై ఐటీ కన్ను | sarpanches Target information technolology | Sakshi
Sakshi News home page

సర్పంచులపై ఐటీ కన్ను

Aug 28 2013 3:39 AM | Updated on Sep 1 2017 10:10 PM

పెద్దపల్లి మండలంలోని ఒక గ్రామ పంచాయతీలో పది రోజుల పాటు విందులు, వినోదాలతో జనం పండగ చేసుకున్నారు. రాజకీయంగా ఎదగడానికి పల్లెను ఆటపట్టుగా భావించిన నయా సంపన్నుడొకరు అడిగిన వారికి అడిగింది సమకూర్చి గ్రామ ప్రథమపౌరుడి కుర్చీ అధిష్టించారు.

సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి మండలంలోని ఒక గ్రామ పంచాయతీలో పది రోజుల పాటు విందులు, వినోదాలతో జనం పండగ చేసుకున్నారు. రాజకీయంగా ఎదగడానికి పల్లెను ఆటపట్టుగా భావించిన నయా సంపన్నుడొకరు అడిగిన వారికి అడిగింది సమకూర్చి గ్రామ ప్రథమపౌరుడి కుర్చీ అధిష్టించారు. ఇందుకు ఆయన చేసిన ఖర్చు కొంచెం అటూ ఇటూగా కోటీకి చేరి ఉంటుందని అంచనా.కరీంనగర్ శివారులోని మరో పల్లెలో కులాలు, వర్గాలు, సంఘాల వారీగా నజరానాలు, విరాళాలు, బహుమానాలు పంచడం ద్వారా మరో ఔత్సాహికుడు గద్దె నెక్కారు. అందుకయిన వ్యయం అరకోటీకి పైమాటే.
 
 ఇదే మండలంలోని మరో ఊరిలో ఒక యువ వ్యాపారి రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినా సర్పంచ్ పదవి పీఠాన్ని అందుకోవాలన్న  ఆయన ఆశ నెరవేరలేదు.అడ్డూఅదుపూ లేకుండా ఖర్చు చేయడం సాధారణ ఎన్నికల్లో మామూలే అయినా పంచాయతీ ఎన్నికల్లో ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం అందరినీ విస్మయానికి గురిచేసింది. గ్రామస్థాయి పదవి కోసం ఇంత భారీగా ఖర్చ చేసిన వ్యవహారాన్ని ఆదాయపన్ను శాఖ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వివిధ మార్గాల్లో ఎన్నికలలో పోటీ చేసి భారీగా ఖర్చు పెట్టిన వారి వివరాలను సేకరించిన ఆదాయపన్నుల అధికారులు జిల్లా ఎన్నికల అధికారుల నుంచి కూడా అభ్యర్థుల వ్యయ నివేదికలను కోరినట్టు సమాచారం.
 
 పూర్తి వివరాలను సేకరించి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 250 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని జిల్లాల వారీగా ఆదాయపన్ను అధికారులకు కూడా ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. ఎన్నికల అధికారులతో సంబంధం లేకుండా కూడా మితిమీరి వ్యయం చేసిన వారి వివరాలను సేకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలనుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని ఆశించిన ఔత్సాహికులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఈసారి పంచాయతీ ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారాయి. ఎన్నారైలు, రియల్ ఎస్టేట్, క్వారీలు, పరిశ్రమలు తదితర వ్యాపారాల్లో బాగా సంపాదించిన బరిలోకి దిగారు.
 
 ఇలా నయా సంపన్నులు రాజకీయాల్లోకి రావడం, వారి మధ్య పంతాల వల్ల కొన్ని చోట్ల పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇలాంటి చోట్ల ఖర్చు కట్టలు తెగింది. గ్రామ రాజకీయాలపై అవగాహన లేకపోవడం, ఎవరేమిటో తెలియకపోవడం తదితర కారణాల వల్ల ఎలాగైనా గెలవాలని భావించిన అభ్యర్థులు ఇష్టారీతిన ఖర్చు చేశారు. పది వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచు అభ్యర్థులు రూ.80 వేలు, పది వేల తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.40 వేలు మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం పరిమితి విధించింది. ఇది ఎక్కడా అమలు కాలేదు. చట్టసభల ఎన్నికలను తలపించేలా సాగిన పంచాయతీ ఎన్నికలలో రూ.లక్షలు ఖర్చు చేశారు. పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో ఆయా పార్టీల్లో ఉన్న ముఖ్యులే ఊళ్లలోనూ లీడర్లుగా చలామణి అయ్యారు. ఎన్నికల తర్వాత సర్పంచులే ఆయా గ్రామాల్లో నాయకులుగా గుర్తింపు పొందుతారు. ఈ గుర్తింపు కోసమే నయా నేతలు ఆరాటపడుతున్నారు. ఆయా వ్యాపారాల్లో భారీ సంపాదన ఉన్న వారు పదవి సంపాదించుకోవడానికి ఎంత ఖర్చయినా వెనుకాడలేదని తెలుస్తోంది. ఈ ఆరాటమే ఇప్పుడు కొత్త చిక్కులు తెస్తోంది. పదవీ సంబరం తీరక ముందే ముంచుకొచ్చిన ఈ గండం నుంచి తప్పించుకునే దారులు వెతుక్కుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement