‘సమైక్య ఉద్యమం చల్లారిందని, విభజన అంశాన్ని ప్రజలు మర్చిపోయారని అనుకోవడం అపోహే. సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వం కోసం, మరోమారు ఉద్యమ పిలుపు కోసం వారంతా సిద్ధంగా ఉన్నారు.
ఏపీఎన్జీవోల సంఘం స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్య ఉద్యమం చల్లారిందని, విభజన అంశాన్ని ప్రజలు మర్చిపోయారని అనుకోవడం అపోహే. సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వం కోసం, మరోమారు ఉద్యమ పిలుపు కోసం వారంతా సిద్ధంగా ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు’’అని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో భవన్‌లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విభజన అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చినపుడు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావించామని, అయితే ప్రస్తుతం బిల్లుపై చర్చ మూడు దఫాలుగా జరిగే అవకాశం ఉన్నందున ఏదశలో ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించాలనే అంశంపై యోచిస్తున్నామని చెప్పారు.తాము నిర్వహించాలనుకున్న అఖిలపక్ష భేటీని 21కి వాయిదా వేసినట్లు తెలిపారు.
రాజకీయ పక్షాల సహకారంతో మరో పెద్ద ఉద్యమానికి కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో ప్రకటించే యోచన ఉందన్నారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ అభిప్రాయాలను చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదేనని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుస్తామని, విభజన వలన ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలిపే ప్రయత్నం చేస్తామన్నారు. 30 రకాల మొండి వ్యాధులకు అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సదుపాయం ఉండే విధంగా హెల్త్ కార్డు నిబంధనలను మార్చాలని కోరామన్నారు. సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు తదితరులున్నారు.