సాగర్‌ నీళ్లొచ్చేస్తున్నాయ్‌..!

Sagar Right Canal Water Release Soon Prakasam - Sakshi

తాగు, సాగు అవసరాల కోసం కుడి కాలువకు నీరు విడుదల

3 వేల క్యూసెక్కులకు పైగా వచ్చే అవకాశం

బుగ్గవాగు నుంచి జిల్లాకు నీటి విడుదల

నేటి ఉదయానికి సరిహద్దుకు చేరిక

సాగుకు రైతుల సన్నద్ధం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎట్టకేలకు ప్రభుత్వం సాగర్‌ కుడికాలువకు తాగు, సాగు నీటి అవసరాల కోసం నీరు విడుదల చేసింది. ఎగువ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి ఇప్పటికే శ్రీశైలం జలాశయం నిండింది. నాగార్జున సాగర్‌కు సైతం పూర్తి స్థాయిలో నీరు చేరింది. దీంతో కుడికాలువ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ నీరు గుంటూరు జిల్లా పరిధిలోని బుగ్గవాగుకు చేరింది. అక్కడి నుంచి శుక్రవారం ఉదయానికి ప్రకాశం జిల్లా సరిహద్దుకు చేరనుంది. జిల్లాకు 3వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇరిగేషన్‌ అధికారులు పేర్కొంటున్నారు. తొలుత గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయనున్నారు.

గుండ్లకమ్మలో 3 టీఎంసీలనిల్వకు అవకాశం..
3.875 టీఎంసీలు సామర్థ్యం కలిగిన గుండ్లకమ్మలో 3 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. అనంతరం రామతీర్థం రిజర్వాయర్‌లో  నీటిని నిల్వ చేస్తారు. ఆ తర్వాత ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. పిబ్రవరి నెల వరకు నీటి విడుదల ఉంటుంది.  సాగర్‌ కుడికాలువ పరిధిలో ప్రకాశం జిల్లాలో 4,37,330 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 1,85,046 ఎకరాలు మాగాణి భూములు ఉండగా 2,49,283 ఎకరాలు ఆరుతడి పంటలు పండే భూములు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో వరిపంటకు సాగునీరు ఇవ్వడంఇదే తొలిసారి. గత ఏడాది సైతం ఎగువన కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్‌ జలాశయంలో 580 అడుగుల మేర నీరు చేరినా కుడికాలువ పరిధిలో ఆయకట్టుకు ప్రభుత్వం సాగునీరు విడుదల చేయలేదు. దీంతో నాలుగేళ్లుగా సాగర్‌ రైతాంగం పంటలు లేక పొలాలు బీళ్లుగా పెట్టుకుని ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది. తిండిగింజలు, పశువుల మేత గోదావరి జిల్లాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు సాగర్‌నీటిని విడుదల చేయడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యంక్తం చేస్తోంది. రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అద్దంకి, దర్శి, పర్చూరు, సంతనూతలపాడు ప్రాంతాల్లో బోరుబావి వసతి ఉన్న రైతాంగం వరినార్లు పోసి సిద్ధంగా ఉన్నారు. నీరు చేరిన వెంటనే నాట్లు వేసే అవకాశం ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top