
సాక్షి, అమరావతి: చినబాబు కనుసన్నల్లో రాష్ట్రంలో విపక్షం ఓట్ల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలుపుపై ఆశలు లేని ఈ మంత్రి ఓట్ల తొలగింపుపైనే ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను బూత్‌లవారీగా తొలగించడమే లక్ష్యంగా ఆ మంత్రి తెరవెనుక చర్యలకు దిగారు. ఇందుకోసం ప్రత్యేకంగా 25 మందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించి ఎన్నారైల నుంచి సాప్ట్‌వేర్ సహకారం తీసుకుంటున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.
ఉండవల్లి, గుంటూరు కేంద్రాలుగా ఓట్ల తొలగింపు
ఆర్నెళ్ల ముందు నుంచే దొడ్డిదారిన బూత్‌లవారీగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కుట్రలకు మంత్రి తెర తీశారు. ప్రతి పోలింగ్ బూత్‌లో అధికార పార్టీకి కనీసం 200 ఓట్లు అధికంగా వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యాచరణలో భాగంగా ప్రత్యేకంగా 25 మందిని ఔట్ సోర్సిగ్‌పై నియమించుకున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ ముసుగులో పనిచేస్తున్న వీరంతా విపక్షం ఓట్లను తొలగించే చర్యల్లో నిమగ్నమయ్యారు. ఉండవల్లి, గుంటూరు కేంద్రాలుగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని మరీ ఓట్ల తొలగింపు కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి 1100 కాల్‌సెంటర్‌కు అందుతున్న అభిప్రాయాలు, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. అనంతరం వారి ఓట్లను దొడ్డిదారిలో తొలగిస్తున్నారు. కొందరు కలెక్టర్లు, అధికారులు ఈ అనైతిక చర్యలకు సహకరించినట్లు పేర్కొంటున్నారు.
రద్దు కోసం ఇన్ని దరఖాస్తులా?
తమ ఓట్లను జాబితా నుంచి తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నిజంగా ఎవరైనా ఇలా దరఖాస్తు చేసుకున్నారా?, ఫామ్ 7 ఇచ్చారా? అనే అంశాలను పరిశీలించకుండా ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని కొనసాగించారు. రాష్ట్రంలో భారీగా ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఓట్ల తొలగించాలంటూ ఫారం 7 కింద దరఖాస్తు చేసిన వ్యక్తులకు నోటీసులు జారీ చేయడంతో అధికార పార్టీ నేతల అక్రమాలు బయటపడుతున్నాయి. చిత్తూరులో ఏకంగా 4,000 ఓట్లు తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో ఫారం 7 ద్వారా దరఖాస్తులు రావడంపై ఆర్డీవో సందేహం వ్యక్తం చేశారు. తమను ఓటరుగా చేర్చాలంటూ వందలు, వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం సహజమేగానీ జాబితా నుంచి తొలగించాలంటూ ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థనలు అందడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దాదారుతో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకంగా 14,278 మంది ఓట్లు తొలగించాలని, పలమనేరులో 8,000 ఓట్లు తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ నోటీసులు జారీ చేయడంతో అసలు విషయం బయటపడుతోంది.
ఎన్నికల వల్ల ఇబ్బంది రాకూడదు: సీఎం
ఆర్టీజీఎస్, ఇ–ప్రగతి సమష్టిగా పనిచేసేలా చూడాలని, అన్ని సేవలు ఆన్‌లైన్‌లో రియల్‌టైమ్‌లో అందించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎన్నికల వల్ల సేవలు అందించేందుకు ఇబ్బందులు రాకుండా చూడాలని పరోక్షంగా ఈ వ్యవస్థలను వినియోగించుకోవాలని సీఎం పేర్కొనడం గమనార్హం.
ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు..
తమ ఓటును తొలగించాలంటూ దరఖాస్తు చేసుకోకుండానే ఎలా నోటీసులు ఇస్తారంటూ పలువురు ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చినబాబు అనుచరగణమే ఆన్‌లైన్‌లో బోగస్ దరఖాస్తులు సమర్పిస్తున్నట్లు వెల్లడవుతోంది. ఇటీవల గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కూడా వందల సంఖ్యలో ఓట్ల తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో ఫారం 7 ద్వారా దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించారు. ఇప్పుడు వారందరికీ నోటీసులు జారీ చేయడంతో ఓటర్లు విస్తుపోతున్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని పేర్కొంటున్నారు.