శరవేగంగా మెట్రో సర్వే | Rapidly Metro Survey | Sakshi
Sakshi News home page

శరవేగంగా మెట్రో సర్వే

Feb 12 2015 1:42 AM | Updated on Oct 16 2018 5:04 PM

శరవేగంగా మెట్రో సర్వే - Sakshi

శరవేగంగా మెట్రో సర్వే

విశాఖ మహా నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు సర్వే శరవేగంగా జరుగుతోంది.

90 శాతం పూర్తయిన హౌస్‌హోల్డ్ సర్వే
టోపోగ్రఫీ సర్వే కూడా దాదాపు పూర్తి
16 నుంచి ట్రాఫిక్ సర్వే ప్రారంభం

 
విశాఖపట్నం సిటీ : విశాఖ మహా నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు సర్వే శరవేగంగా జరుగుతోంది. దాదాపు గత నెల రోజులుగా వివిధ సాంకేతిక బృందాలు నగరంలో విస్తృతంగా పర్యటించి సర్వే చేపడుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరి నాటికి సర్వేలు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వ మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ చెప్పినట్టుగానే విశాఖలో వేగంగా సర్వే జరుగుతుంది. తొమ్మిది వేలకుగాను బుధవారం నాటికి 8400 ఇళ్లల్లో ఇంటింటి సర్వే పూర్తయింది. 39 కిలోమీటర్ల టోపోగ్రఫీ సర్వేకి దాదాపు 30 కిలోమీటర్ల మేర  సర్వే పూర్తయినట్టు తెలిసింది. సర్వేలు త్వరితగతిన పూర్తి అయ్యేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు.
 -మహా విశాఖలో మూడు కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు సర్వే చేపడుతున్నారు. 39 కిలోమీటర్ల మేర  నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం టోపోగ్రఫీ, ట్రాఫిక్, హౌస్‌హోల్డ్ సర్వేలను ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు సర్వేలను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేసి ఆ తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను రూపొందించాలన్నది శ్రీధరన్ ఉద్దేశం. డీపీఆర్ పూర్తయిన వెంటనే వివిధ సాంకేతిక, ఆర్థిక, అంశాలతో విశ్లేషించి మరో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రభుత్వంతో తదుపరి చర్చలు సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టు ఆమోదం పొందిన తర్వాత కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.

-39 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ఏర్పాటుకు అవసరమైన ట్రాఫిక్ సర్వేను ఈనెల 16 నుంచి ప్రారంభిస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను విశాఖ కేంద్రంగా పని చేస్తున్న ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతినిధి రవి పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో నిర్వహించే ఈ సర్వే ఆధారంగానే మెట్రో రైలు ఆగే స్టేజీల ఏర్పాటు జరుగుతుంది. ఎన్‌ఏడీ జంక్షన్ నుంచి మధురవాడ వరకూ 24 కిలోమీటర్లలో మెట్రో రైలు హాల్టులను గుర్తిస్తారు. ప్రయాణికుల రాకపోకలు, ఏయే వర్గాలు ఎంతెంత మొత్తం ప్రయాణాల కోసం వెచ్చిస్తున్నారో, ఏయే వేళల్లో ఎన్ని వాహనాలు నడుస్తున్నాయో, బస్సులు ఖాళీగా తిరిగే వేళలు, ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉన్న వేళలను ఈ సర్వేలో లెక్క తేల్చనున్నారు. ట్రాఫిక్ సర్వేను వేగవంతంగా చేసేందుకు అవసరమైన బృందాలను సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ట్రాఫిక్ సర్వేని ప్రారంభించి వచ్చే వారం నుంచి 10 రోజుల్లో మొత్తం సర్వేని పూర్తి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ ప్రజలు రవాణా అవసరాలు ఎలా తీర్చుకుంటున్నారో తెలుసుకునే హౌస్ హోల్డ్ సర్వే నగరంలోని అన్ని వార్డుల నుంచి సేకరించారు. ఇంకా 300 నుంచి 400 మంది ఇంటి యజమానుల నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంది. ఆ సర్వే పూర్తయిన వెంటనే డేటాను కంప్యూటరీకరిస్తారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement