‘స్వగృహ’ క్లియరెన్స్ సేల్! | Rajiv Swagruha Corporation clearance Sell to decrease 25% price | Sakshi
Sakshi News home page

‘స్వగృహ’ క్లియరెన్స్ సేల్!

Nov 14 2013 4:54 AM | Updated on Sep 2 2017 12:34 AM

క్లియరెన్స్ సేల్... అమ్ముడు కాకుండా మిగిలిపోయిన లేదా లోపాలున్న వస్తువులను వదిలించుకునే క్రమంలో దుకాణదారులు ధర భారీగా తగ్గించి అమ్మెయ్యడాన్నే క్లియరెన్స్ సేల్‌గా చెబుతూ ఉంటారు.

సాక్షి, హైదరాబాద్: క్లియరెన్స్ సేల్... అమ్ముడు కాకుండా మిగిలిపోయిన లేదా లోపాలున్న వస్తువులను వదిలించుకునే క్రమంలో దుకాణదారులు ధర భారీగా తగ్గించి అమ్మెయ్యడాన్నే క్లియరెన్స్ సేల్‌గా చెబుతూ ఉంటారు. ఇదేమాదిరిగా ప్రభుత్వం ఇప్పుడు ‘స్వగృహ’ ఇళ్లను క్లియరెన్స్ సేల్‌కు అమ్మేందుకు సిద్ధమవుతోంది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నగరంలో బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్‌ల్లో దాదాపు 7 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అయితే, నిధుల కొరతతో వీటి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఇవి ఖాళీగా ఉండిపోయాయి. మరికొంత కాలం ఈ ఇళ్లు ఇలాగే ఉంటే ‘పాడుబడ్డ నిర్మాణాల’నే పేరుపడితే జనం కొనరని, అప్పుడు ఏకంగా రూ. వేయి కోట్లు నష్టం రావచ్చని అంతర్జాతీయ వ్యాల్యూయేటర్స్ హెచ్చరించారు. దీంతో ఈ ఇళ్ల ధరను 25 % తగ్గించి అమ్మేయాలని స్వగృహ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 2,800 ఫ్లాట్లతో రూపుదిద్దుకుంటున్న జవహర్‌నగర్ ప్రాజెక్టుపై కార్పొరేషన్ ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ.400 కోట్లు. ఇది డిమాండ్ లేని ప్రాజెక్టుగా గుర్తించిన అధికారులు కొంతకాలం క్రితం పనులు ఆపేశారు.
 
 దీన్ని ఉన్నదున్నట్టు వేలం ద్వారా అమ్మే ఆలోచనతో ఆస్తుల విలువను నిర్ధారించే మూడు అంతర్జాతీయ వ్యాల్యూయేటర్స్‌కు అప్పగించారు. నెలపాటు కసరత్తు చేసిన ఆ సంస్థలు ఈ ప్రాజెక్టు విలువను రూ.190 కోట్లుగా నిర్ధారించాయి. అదేమాదిరిగా పోచారం, బండ్లగూడ ప్రాజెక్టుల విలువ కూడా చాలా తక్కువేనని ఈ సంస్థలు తేల్చాయి. ‘ఖాళీ స్థలాన్ని కొని నచ్చిన రీతిలో ఇళ్లు కట్టుకోవటానికి ఎవరైనా ముందుకొస్తారు. కానీ.. మీకు న చ్చిన రీతిలో కట్టి అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపరు. అందువల్లే ఈ నిర్మాణాలకు అంతగా విలువ లేదు..’ అంటూ ఆ సంస్థలు ఇచ్చిన నివేదిక చూసి ‘స్వగృహ’ ఉన్నతాధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. ఆ లెక్కన ప్రాజెక్టులను గంపగుత్తగా అమ్మితే రూ.వేయి కోట్లకుపైగా నష్టం వచ్చే అవకాశం ఉన్నందున, ఇళ్ల ధరలను భారీగా తగ్గించి విడివిడిగా అమ్మితే సాధారణ ప్రజలు హాట్ కేకుల్లా కొంటారని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ ధరకంటే 25 % మేరకు తగ్గించి అమ్మితే నష్టాలను తగ్గించవచ్చని స్వగృహ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement