స్వ‘గృహ’ కష్టాలు | Rajiv swagruha corporation back foot on underground cable system | Sakshi
Sakshi News home page

స్వ‘గృహ’ కష్టాలు

Oct 18 2013 2:56 AM | Updated on Sep 1 2017 11:44 PM

ప్రైవేట్ సంస్థలు నిర్మించే ఇళ్లకు తీసిపోకుండా అన్ని వసతులతో తక్కువ ధరకే స్వగృహ ఇళ్లను అందిస్తామని ఊదరగొట్టిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ క్రమంగా ఒక్కో ‘ప్రత్యేకత’కు నీళ్లొదులుతోంది

సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ సంస్థలు నిర్మించే ఇళ్లకు తీసిపోకుండా అన్ని వసతులతో తక్కువ ధరకే స్వగృహ ఇళ్లను అందిస్తామని ఊదరగొట్టిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ క్రమంగా ఒక్కో ‘ప్రత్యేకత’కు నీళ్లొదులుతోంది. పైపు ద్వారా వంటగ్యాస్ సరఫరా, సోలార్ వాటర్ హీటింగ్, మెరుగైన చలవరాళ్లతో ఫ్లోరింగ్, బ్రాండెడ్ కంపెనీల ఫిటింగ్‌ల బిగింపు... తదితర ప్రత్యేకతలకు ఇప్పటికే తిలోదకాలిచ్చారు. ఇక భూగర్భ కేబుల్ వ్యవస్థకూ మంగళం పాడాలని తాజాగా నిర్ణయించారు.
 
 నిధులు లేక పనులెలా కొనసాగించాలో తెలియుక అధికారులు అయోమయంలో ఉండగా, ప్రభుత్వ పరంగా సాయం చేసేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపకపోవటంతో ఈ పరిస్థితి ఎదురైంది. రూ.500 కోట్లు కావాలంటూ దాదాపు ఏడాదిన్నరగా అధికారులు కోరుతుండగా, ప్రభుత్వం ఇటీవల రూ.105 కోట్లు వూత్రమే అందజేసింది. ఈ నిధులతో కొన్ని ప్రాజెక్టులను ఎలాగో ముగించి, దరఖాస్తుదారులకు అందించి, ఇచ్చిన నిధులను వడ్డీ సహా తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. ఆ చాలీచాలని నిధులతో పనులు చేయటం సాధ్యం కాకపోవటంతో... ప్రజలను ఆకట్టుకునేందుకు మొదట్లో చేసిన  హంగులను తొలగించి ఆర్థికభారం నుంచి బయటపడాలన్నది అధికారుల ఆలోచన.
 
 ప్రతి ఇంటికి సోలార్ వాటర్ హీటర్, పైప్‌లైన్‌లో వంటగ్యాస్ వంటి వసతులు ఉండబోవని ఇప్పటికే తేల్చిచెప్పారు. ఫ్లోరింగ్‌కు, స్నానాల గదులలో, ఇతర చోట్ల వాడే ఫిటింగ్స్‌ను బ్రాండెడ్ కంపెనీలవి కాకుండా, మామూలు కేటగిరీవి వాడాలని నిర్ణయించారు. విద్యుత్తు స్తంభాలు, వాటికి అడ్డదిడ్డంగా కరెంటు వైర్లు వేళ్లాడే పరిస్థితికి భిన్నంగా  భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించినా ఇపుడు అదీ వద్దనుకున్నారు. ఇప్పటికి, ఒకటి రెండు ప్రాజెక్టుల్లో భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయుగా, అందులో ఒక్కో ప్రాజెక్టుకు రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు భారం పడటంతో, దీని బదులు మామూలుగా బయటకే  కేబుళ్లు ఏర్పాటు చేస్తే కనీసం 40 శాతం వరకు ఖర్చు తగ్గుతుందని లెక్కలు తేల్చారు.  భూగర్భ కేబుల్ వ్యవస్థ నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, నిర్వహణకు తగ్గ నిపుణులు అందుబాటులో లేరన్న సాకుతో ఇప్పుడు భూగర్భ కేబుళ్ల వ్యవస్థకు కూడా మంగళం పాడబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement